ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇవ్వలేనని, చాలామంది నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తోచక గగ్గోలు పెడుతున్నారు. పొత్తుల కోసం పాకులాడుతూ తమ గొంతు కోస్తున్నారని పలువురు నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు. అన్ని సీట్లు వదులుకున్నాక ఇక అధికారం ఎలా వస్తుందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 50కిపైగా ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు, బీజేపీకి 25 ఎమ్మెల్యే, ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వక తప్పదని టీడీపీలో పది రోజులుగా చర్చ జరుగుతోంది.
మొత్తం 75 ఎమ్మెల్యే, పది ఎంపీ స్థానాలను టీడీపీ ఆ రెండు పార్టీలకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. వాటిలోనే నేతలు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని చంద్రబాబు శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో నాయకులందరికీ స్పష్టంగా చెప్పారు.
సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించినా… సీట్లపై నోరు మెదపలేదు. పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి అమిత్‌షా శరణు కోరిన తర్వాత బీజేపీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలను మానసికంగా సిద్ధం చేసేందుకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలిసారి సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వడం కుదరదని, సర్దుకుపోవాలని బాంబు పేల్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. జిల్లాల వారీగా ఎవరి సీట్లు ఎగిరిపోయే జాబితాలో ఉన్నాయో ఆరా తీస్తూ భగ్గుమంటున్నారు. బీజేపీ, జనసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారని వాపోతున్నారు. చంద్రబాబు తాను, తన కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని బీజేపీ కాళ్ల కింద పెడుతున్నారని, ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి, చంద్రబాబు నడుపుతున్న పార్టీకి సంబంధం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
source : sakshi.com
Discussion about this post