‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. అందులో భాగంగా తన పాలనలో 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి కన్న తండ్రి ఆశయాన్ని కుమారుడిగా జగన్ నెరవేర్చ లేకపోవడం దారుణం’’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. న్యాయ యాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆమె పర్యటించారు. మడకశిర, నార్పలలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాత్రి ఉరవకొండ పాత ప్రయాణ ప్రాంగణంలో ఆ పార్టీ అభ్యర్థి రాకెట్ల మధుసూదనరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. 6 నెలల్లో హంద్రీనీవా పనులు పూర్తి చేస్తానని ఉరవకొండలోనే జలదీక్ష పేరుతో జగన్ ధర్నా చేశారని, ఐదేళ్లు గడిచినా వాగ్దానం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. శింగమనల నియోజకవర్గంలో ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తామని రైతులను నిండా ముంచాడన్నారు. వైఎస్సార్ హయాంలో మడకశిర ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించారు. జగన్ సీఎం అయిన తరువాత ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదన్నారు. 10లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఆయన.. ఇవ్వకుండా గాడిదలు కాశారా? అంటూ మండిపడ్డారు.
source : eenadu.net
Discussion about this post