రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. స్థానిక గన్నెవారిపల్లి కాలనీలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగిందన్నారు. ఈ సభను చూసిన టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగుతీశాయన్నారు. దేశ రాజకీయాల్లోనే రాప్తాడు సిద్ధం సభ ఓ మైలు రాయిగా చిరస్థాయిగా నిలుస్తోందన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక న్యాయాన్ని పాటించడమే సభ విజయవంతానికి కారణమన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారనేందుకు ఈ సభనే నిదర్శనమన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోవు ఎన్నికల్లో టీడీపీ కూటమికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
source : sakshi.com
Discussion about this post