అధికారంలో ఉన్నన్నాళ్లూ దోపిడీ, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన జేసీ సోదరులు ఇంకా ఆటవిక సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని సజ్జలదిన్నె గ్రామంలో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోర్టుల్లో కేసు పత్రాలను దొంగిలించిన ఘనత జేసీ సోదరులకే దక్కిందన్నారు. కప్పం కట్టలేదంటూ టీడీపీ హయాంలో పరిశ్రమలకు తాళాలు వేసి వారు చేసిన దౌర్జన్యాన్ని ఇంకా ప్రజలు మరువలేదన్నారు. అనాగరిక చేష్టలతో తాడిపత్రి నియోజకవర్గాన్ని ఆటవిక రాజ్యంగా మార్చారన్నారు. నేడు తాము అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే ఓర్వలేక కోర్టులలెక్కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యంలో 40 ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో తాము దేవదాయశాఖకు మరో చోట స్థలం చూపిస్తామంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చాడన్నారు. ఆర్‌టీఓ కార్యాలయం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను సొంత నిధులతో నిర్మిస్తున్నా అడ్డుపడ్డాడని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో అభివృద్ధి పనులు చేయకుండా గాడిదలు కాశారా అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు వారికి మళ్లీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎవరికీ భయపడకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
source : sakshi.com
Discussion about this post