వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సొంత నిధులతో బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే అడ్డుకోవాలని చూడడం దారుణమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ కౌన్సిలర్ల వల్లే తాడిపత్రిలో మురుగు సమస్యలు నెలకొంటున్నాయన్నారు. కాలువలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. వాటిని తమకు అంటగట్టి బురదజల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. అమృత్ స్కీం కింద ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రూ. 63 కోట్లు నిధులు తెస్తే వాటిని మున్సిపల్ కౌన్సిల్‌లో పెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడ్డాడన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ప్రజలకు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత రెచ్చిపోతున్నాడని, ప్రజలే ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని కోరారు. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రాజు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబులరెడ్డి, జెడ్పీటీసీ రమణమ్మ, ఆలూరు రామేశ్వరెడ్డి ఉన్నారు.
source : sakshi.com
Discussion about this post