‘‘భాజపా, తెదేపా, జనసేన జెండాలు వేరు కావొచ్చు. కానీ సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మా ఎజెండా ఒక్కటే. ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికే మేం జట్టు కట్టాం. మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకు కావాలి’’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. గత అయిదేళ్లలో వైకాపా విధ్వంస, అహంకార, అవినీతి పాలన వల్ల రాష్ట్రప్రజల జీవితాలు నాశనమైపోయాయని.. రాష్ట్ర భవిష్యత్తు మారేలా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఆదివారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘దేశంలో ఎన్డీయేకి 400 పైగా సీట్లు వస్తాయి. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో గెలిపించి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. ఆ బాధ్యత ప్రజలదే. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుంది. ఎన్డీయే పాలనలో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం’’ అని చెప్పారు. ప్రజల కోసం పరితపించే నాయకుడు పవన్‌కల్యాణ్ అని, ఆయనకు అభినందనలని అన్నారు.
source : eenadu.net










Discussion about this post