ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైనా, క్రిమినల్ కేసులు నమోదైనా అవి దీర్ఘకాలం పాటు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ‘మమ్మల్ని విధుల నుంచి తొలగించేసి, కేసులు నమోదు చేసినంత మాత్రాన ఏమైపోతుందిలే’ అనే పెడధోరణితో వ్యవహరిస్తే జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నట్లే. భవిష్యత్తులో వారు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా ఈ కళంకం వల్ల అనర్హులవుతారు. ఒక మాదిరి ప్రైవేటు ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారొచ్చు. ప్రస్తుతం నమోదైన క్రిమినల్ కేసుల్లో న్యాయస్థానాల్లో శిక్ష పడితే సంవత్సరంపైనే జైలు శిక్షతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకుల ఉచ్చులో చిక్కుకుని, వారిచ్చే తాత్కాలిక ప్రలోభాలకు లోనై ఆడించినట్టల్లా ఆడితే.. ఆ తర్వాత వాలంటీర్లను కాపాడేందుకు వారిలో ఏ ఒక్క నాయకుడూ ముందుకు రారు. వాలంటీర్లు ఇప్పుడు వేస్తున్న ప్రతి తప్పటడుగుకు పర్యవసానం, ఫలితం వారు సొంతంగా అనుభవించాల్సిందే.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవవేతనం పొందుతున్న గ్రామ, వార్డు వాలంటీర్లు ‘పబ్లిక్ సర్వెంట్’ కేటగిరీలోకి వస్తారు. వీరు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది వాలంటీర్లను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. పలువురిపైన ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మరికొందరిపై సర్వీసు నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం ‘విధుల నుంచి తొలగించేస్తే మరీ మంచిది.. స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం’ అనే బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారందరూ మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే.
కేసుంటే… ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు వదులుకోవాల్సిందే
వాలంటీర్లలో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన యువతే. వీరిలో చాలా మంది వాలంటీరుగా పనిచేస్తూనే ప్రభుత్వోద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్వాసనకు గురైనా, కేసు నమోదైనా ప్రభుత్వం ఉద్యోగంపై వారు ఆశలు వదలుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఉద్యోగమిచ్చే ముందు.. నిఘా విభాగం ద్వారా ‘క్యారెక్టర్ అండ్ యాంటిసెడెంట్స్’ వెరిఫికేషన్ చేయిస్తారు. వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో ప్రభుత్వంలో ఏదైనా బాధ్యతల్లో పనిచేశారా? ఆ విధుల్లో నుంచి ఉద్వాసన, సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారా? నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలున్నాయా? ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? వాటిలో అరెస్టయ్యారా? న్యాయ, పోలీసు విచారణను ఎదుర్కొన్నారా? జైలుకెళ్లారా? కోర్టు జరిమానా, అపరాధరుసుం విధించిందా? ఏదైనా కేసులో శిక్ష పడిందా? కోర్టుల్లో ఏదైనా విచారణ పెండింగ్‌లో ఉందా తదితర అంశాలన్నీ పరిశీలిస్తారు. ఏ కేసులూ లేనివారికే ‘క్యారెక్టర్ అండ్ యాంటిసెడెంట్స్’ సర్టిఫికెట్ జారీ అవుతుంది. అది ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేకపోతే పరీక్షలు రాసి, అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికైనా ప్రభుత్వోద్యోగం ఇవ్వరు.
జైలు ఊచలు లెక్కించక తప్పదు
కొందరు వాలంటీర్లు వైకాపా అభ్యర్థుల తరఫున ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేస్తున్నారు. ఇది ఓట్ల కొనుగోలు కిందే లెక్క. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123 (1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. అధికార పార్టీ నాయకులు వాలంటీర్లకు కానుకలిస్తున్నారు. ఇది లంచం కిందే లెక్క. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు, ఐపీసీలోని 171బీ, 171ఈ ప్రకారం ఇది నేరం. వైకాపా అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న వాలంటీర్లపై సర్వీసు ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు కూడా ఆస్కారం ఉంది. ఈ నేర నిరూపణ జరిగి శిక్ష పడితే వాలంటీర్లు జైలు ఉచలు లెక్కించక తప్పదు. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారు కాబట్టి వారికీ ఈ కింది చట్టాలు వర్తిస్తాయి.
ప్రభుత్వోద్యోగిని ప్రలోభపెట్టటం నేరం
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 123 (7): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా వారి ప్రతినిధి ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందటం, పొందేందుకు యత్నించటం, కానుకలతో ప్రలోభపెట్టటం నేరం. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈ అవినీతి కార్యకలాపాల్ని సవాల్ చేయొచ్చు.
ఓటర్లకు నగదు, కానుకల పంపిణీ లంచమివ్వటమే
ఐపీసీ సెక్షన్ 171బీ, 171ఈ: ఎవరైనా సరే తనకు లేదా తాను మద్దతిచ్చేవారికి ఓటేయాలంటూ ఓటర్లకు నగదు, కానుకలు, బహుమతులు పంపిణీ చేయటం నేరం. దీన్ని లంచం ఇవ్వటంగానే పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై పైన పేర్కొన్న సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఈ నేరం నిరూపణయితే ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ (7): అధికారిక విధులు, కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవటం నేరం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా నాయకుల నుంచి కానుకలు, బహుమతులు తీసుకోవటం కూడా ఈ సెక్షన్ కింద నేరమే అవుతుంది.
source : eenadu.net
Discussion about this post