జగన్ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ‘నాకు జీతం వచ్చింది’ అని నెల తొలిరోజే ఆనందంతో వాట్సప్ గ్రూపుల్లో పెట్టడమనేది… జగన్ పాలనలో ఊహించుకోవటానికే సాధ్యం కాని పరిస్థితి! ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు 12వ తేదీ వరకూ జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడింది. జీతాల కోసం పొరుగుసేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు ఇబ్బంది పడడం లాంటివి ఒకటీ అరా చూసుంటాం. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ‘జీతాలు ఇప్పించండి మహాప్రభో’ అంటూ వేడుకునే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు. అందుకే ఘనత వహించిన జగన్ పాలనలో జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగుల సంఘం ఏకంగా జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. దీంతో ప్రభుత్వం పరువుపోయింది. ఈ వినతిపత్రం ఇచ్చినందుకు ఆ నాయకుడిని జగన్ సర్కారు తీవ్ర వేధింపులకు గురి చేసింది. ప్రతినెలా ‘ప్రభుత్వానికి అప్పు పుట్టిందా?’, ‘ఈ నెల మనకు జీతం అందుతుందా?’ అంటూ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టిన దుస్థితి జగన్ పాలనలో కొనసాగింది. జీతం వస్తే పండగే అనే పరిస్థితి కనిపించింది. ఇక పెన్షనర్ల పరిస్థితైతే వర్ణనాతీతం. పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంతో మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయారు. ఆర్థిక ప్రయోజనాల మాట దేవుడెరుగు.. ఒకటో తేదీన జీతం, పెన్షన్లు ఇస్తే చాలు అనే దుస్థితిని జగన్… ఉద్యోగులకు కల్పించారు.
‘జగనన్నా.. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)లో ఉద్యోగులం.. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. అప్పుల కోసం ప్రయత్నించినా పుట్టలేదు. దసరా పూట పస్తులు ఉండలేక పిల్లల డిబ్బీని పగలగొట్టి డబ్బులు వాడుకుంటున్నాం’ అంటూ.. ఓ ఉద్యోగి తన బాధను గతేడాది వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది. వీటిని ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్‌టీవీలు, విద్యాకానుకలు, నాడు-నేడుకు మళ్లించి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఇదే కాదు.. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు చాలామంది జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా, డీఅడిక్షన్ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాల్లేవు. ఇలా అనేక మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు.
జగన్ ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులను మోసం చేసింది. ఎప్పుడూ లేనివిధంగా మధ్యంతర భృతి(ఐఆర్) 27% ఉంటే 4% తగ్గించి 23% ఫిట్‌మెంట్ ఇచ్చింది. పీఆర్సీ చరిత్రలో ఇలా ఇవ్వడం ఇదే మొదటిసారి. ఐఆర్‌తో తీసుకున్న జీతం కంటే ఫిట్‌మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోయింది.
ఇంటి అద్దె భత్యంలో కోత వేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్‌ఆర్‌ఏ ఉంటే జగన్ వచ్చాక 24శాతానికి.. జిల్లా కేంద్రాల్లో గతంలో 20% హెచ్‌ఆర్‌ఏ ఉండగా.. దీన్ని 16 శాతానికి కుదించేశారు.
పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. పీఆర్సీ పేస్కేళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్ స్కేల్స్ ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్ కొత్తవి నిర్ణయిస్తారు?
12వ పీఆర్సీ కమిషన్ వేసినా ఇది ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ప్రతిసారీ ఐఆర్ ఇస్తారు. ఈసారి ఐఆర్‌కూ జగన్ సర్కారు మంగళం పాడేసింది.
source : eenadu.net
Discussion about this post