విశాఖ నగరాన్ని హైదరాబాద్ కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తాం. ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా చేసి, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’…అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ విశాఖను మళ్లీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు.
టీడీపీకి బలమే కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని లోకేశ్ అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను కల్పిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. రానున్న రెండు నెలలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఇంటింటికీ వెళ్లి ‘సూపర్ సిక్స్’ పథకాల గురించి వివరించాలన్నారు.
టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ఐదు రూపాయలు ఇస్తే పోస్టులు పెట్టే కొంతమంది యత్నిస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని నారా లోకేశ్ సూచించారు. టీడీపీ, జనసేన కార్యకర్తల లక్ష్యం ఒక్కటేనని, ‘హలో ఏపీ, బైబై వైసీపీ’ అని లోకేశ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించిన అధికారులు, వైసీపీ నాయకులపై అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాను రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని, దీనిపై కోర్టుకు వెళుతున్నారని పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను అరెస్టు చేయాలని లోకేశ్ అన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post