ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. ఇది పింఛను పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆడుతున్న ‘జగనా’్నటకం. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ ఆయన అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. అయినా మే 1న పింఛను పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీచేశారు. పింఛనుదారుల బ్యాంకుఖాతాల్లో నగదు జమచేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. అయినా వారిని ఇళ్ల నుంచి బయటకు రప్పించేలా నిర్ణయం తీసుకోవడమేంటని అడుగుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేము మహాప్రభో.. ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛనుదారులు వేడుకుంటుంటే.. గతనెల కంటే మరిన్ని ఇక్కట్లకు గురిచేసే నిర్ణయాన్ని తీసుకుని వైకాపా సేవలో తరించేందుకే ఆయన మొగ్గుచూపారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారు. ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్‌రెడ్డి కనిపిస్తున్నా.. వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్, ధనుంజయరెడ్డిలే. పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. తగినంత మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నా.. ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బందేమిటి? నేరుగా బ్యాంకుఖాతాల్లో జమచేయడానికి ఇతర పథకాలు వేరు, పింఛన్ల పంపిణీ వేరు. గత ఐదేళ్లుగా పింఛనుదారుల ఇళ్లవద్దనే నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ విధానంలో ఏ మాత్రం మార్పులు చేసినా… పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం సీఎస్‌కు తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది వైకాపాకు వంతపాడటమే అవుతుంది. పింఛనుదారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెదేపాపై వేసే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛను అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్తకంఠంతో చెప్పారు. అయినా అలా పంపిణీ చేయడానికి మాత్రం మనసు రావట్లేదు. మీరు ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారి కదా… మరి ఎందుకు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సీఎస్ జవహర్ రెడ్డిని పింఛనుదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా రెండు, మూడు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా… ఇలాంటి వికృత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,047 బ్యాంకులున్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛను పంపిణీ కోసమే ఉండరు. చాలామంది పింఛనుదారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్‌లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. పింఛను డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు. పైగా పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లినరోజే నగదు ఇవ్వకుండా గంటలతరబడి వేచి ఉన్న తర్వాత… మర్నాడో, ఆ మర్నాడో రమ్మని తిప్పుతారు. 2019లో తెదేపా ప్రభుత్వం పసుపు-కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూలైన్లలో మహిళలు నిల్చుని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది.
source : eenadu.net
Discussion about this post