ఉదయం 11:30 గంటలు.. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. పైన భానుడి భగభగ, కింద రోడ్డు సెగ.. వీటన్నింటినీ లెక్క చేయకుండా ఇద్దరు అవ్వలు అనంతపురం – చెన్నై జాతీయ రహదారిపై మొలకలచెరువు నుంచి మదనపల్లెకు వచ్చే వాహనాలను ఆపి.. ‘మా పెద్ద కొడుకు ఎంత వరకు వచ్చారు?’ అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ‘ఏం అవ్వా.. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు’ అని అడగ్గా.. ‘మాది ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉండే ఆవులవారిపల్లె.
ఈ రోడ్డులో సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు. ఇంత ఎండలో మీరెందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించగా.. ‘రూ. మూడు వేల పెన్షన్ ఒకటో తేదీ ఉదయాన్నే మా గుమ్మం దగ్గరకు పంపాడు.
కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల యోగక్షేమాలు పట్టించుకోని ఈ రోజుల్లో మాలాంటి పండుటాకుల కష్టాలను గుర్తెరిగి వలంటీర్‌ల ద్వారా పెన్షన్ ఇంటికి పంపి అండగా ఉన్నాడు. కంటివెలుగు పథకంతో మా కళ్లకు మసకలు తొలగించాడు. మా ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాడు. ఇంత చేసిన ఆ సామిని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు.
సీఎం వైఎస్ జగన్ ద్వారా లబ్ధి పొందిన వారితో అనంతపురం – చెన్నై జాతీయ రహదారి మంగళవారం కిక్కిరిసింది. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌ను ఓ సారి చూద్దామని.. వీలైతే ఆయనను కలుద్దామని.. కుదిరితే మాట్లాడదామని ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో అన్నమయ్య జిల్లా ప్రజలు పోటెత్తారు. మదనపల్లె జనసంద్రాన్ని తలపించింది. తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలు వైఎస్ జగన్‌కు జై కొట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా చీకటిమానిపల్లెలో ఏర్పాటు చేసిన బస కేంద్రం నుంచి ఉదయం 10:25 గంటలకు సీఎం జగన్ రోడ్‌షో ప్రారంభించారు. కూత వేటు దూరంలోనే అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశిస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ములకలచెరువులో భారీ గజమాలతో సీఎంను ప్రజలు సత్కరించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనానికి అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు.
source : sakshi.com
Discussion about this post