సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3వేల బస్సులను కేటాయించింది. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులనూ వదల్లేదు. ప్రయాణికులు, భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సభకు పెద్దఎత్తున బస్సులు తరలించడంతో రాయలసీమ అంతటా శనివారం మధ్యాహ్నం నుంచి బంద్ వాతావరణం నెలకొంది. కొన్ని బస్టాండులు బోసిపోయాయి. అరకొరగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడి కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేతలపై మండిపడుతున్నారు.
ఇప్పుడే కాదు.. మాది పేదల ప్రభుత్వమంటూ మాటలతో ఊదరగొట్టే జగన్.. అధికారం చేపట్టినప్పటి నుంచి వారిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో అధికార పార్టీ పెట్టే సభలకు మళ్లించి అవస్థల పాల్జేస్తున్నారు. పేదలు ఎలాపోతే నాకేంటి, సిద్ధం సభకు బస్సులు ఉంటే చాలు అనేలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు.
నిరుపేద ప్రయాణికులకు సేవలందించాల్సిన ఆర్టీసీ యాజమాన్యం.. అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది. ప్రతిపక్షాల సభలకు పదుల సంఖ్యలో బస్సులడిగినా ఇవ్వని ఆర్టీసీ యాజమాన్యం.. అధికార వైకాపా రాప్తాడులో నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభకు వేల బస్సులు కేటాయించడం గమనార్హం.
వైకాపా 2022 జులైలో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి ఆర్టీసీ 1,857 బస్సులు కేటాయించింది. గతనెల 27న భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సభకు 850, ఈనెల 3న దెందలూరు సభకు 1,357 బస్సులు తరలించింది. ఇప్పుడు రాప్తాడు సభకు మూడు వేల బస్సులు ఇచ్చేసింది. ఇలా ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం.. అధికార వైకాపా ముందు మోకరిల్లుతోంది. వేలాది బస్సులు ఒకేసారి మళ్లిస్తే.. ప్రయాణికులు రాకపోకలు ఎలా సాగిస్తారనేది ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇదేమని ప్రశ్నిస్తే.. డబ్బులు చెల్లిస్తే ఏ పార్టీకి, ఏ వ్యక్తులకైనా అడిగినన్ని బస్సులు ఇస్తామని ఆర్టీసీ అధికారులు నీతి వ్యాఖ్యాలు చెబుతారు. ప్రతిపక్ష తెదేపా గత ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడుకు, ఇటీవల విజయనగరం జిల్లాలో నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం బస్సులు అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. అడ్వాన్స్ తీసుకొని బస్సులు పంపాలని తెదేపా నేతలు వివిధ డిపోల అధికారులను కలిసినా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఆర్టీసీ ఎండీకి లేఖరాసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇదిగో అదిగో అంటూ చివరికి ముఖం చాటేశారు.
450 కి.మీ. దూరం నుంచి బస్సుల తరలింపు
ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడులోని సిద్ధం సభకు 3 వేల బస్సులు కేటాయించారు. సంస్థలో ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సులు కలిపి 10 వేలు ఉండగా, అందులో 3 వేల బస్సులు ఒకేసారి మళ్లించడంపై ఆర్టీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post