జనసేన నుంచి టికెట్లు దక్కని వారికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. అలా సీట్లు రాని ఆశావహులు తన గెలుపు కోసం కృషి చేయాలని వర్తమానం పంపారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఇచ్చిన పిలుపు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతోంది. భంగపడ్డ జనసేన నేతలకు పార్టీ ముఖ్య నేతలతో ఈ తరహా ఫోన్లు చేయిస్తున్నారు. పవన్ గెలుపు కోసం పని చేయడం ఓ గొప్ప అవకాశంగా భావించాలని ఉచిత సలహా కూడా ఇస్తుండడంతో నిరాశావహులంతా విస్తుపోతున్నారు. ఇలా ప్రచారం చేస్తే ఆయన దృష్టిలో పడతారని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యతనిస్తారని మరో ఆశ కల్పిస్తున్నారు.
మేం ఉండే నియోజకవర్గాలను వదిలి పిఠాపురం ఎందుకు రా.. రమ్మంటున్నారన్న సందేహం ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడుంటే టికెట్ రాలేదన్న అసంతృప్తితో టీడీపీకి సహాయనిరాకరణ చేస్తామనే అపనమ్మకమా? అక్కడ మా వల్ల ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నిజంగా ఆయనకు ఉందా? అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం. అధినేత పిలుస్తున్నారు కదా.. ఓ సారి వచ్చిపోదామని బయల్దేరుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఈనెల 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రచారాన్ని ఆరంభించి, మూడు విడతలుగా ప్రచారం కొనసాగిస్తారని సోమవారం జనసేన పార్టీ పేర్కొంది.
source : sakshi.com
Discussion about this post