రాజకీయ చైతన్యానికి మారుపేరైన కోనసీమ గురువారం జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం వేలల్లో తరలిరావడమే కాదు.. వారితో గొంతు కలిపారు. నేతలిద్దరి ప్రసంగాలకూ అడుగడుగునా స్పందించారు. చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకూ స్పందించి సమాధానాలు చెప్పారు. చుట్టూ ఉన్న జనం చేతులెత్తి ఉత్సాహంతో జజ్జనకరి జనారే అంటూ ఊగారు. సభ ముగిసి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వారాహి వాహనం దిగిన తర్వాత కూడా అక్కడ వినిపించిన పాటకు వేదిక ముందు యువత నృత్యాలు చేస్తూనే ఉన్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట కేంద్రంలోను, అమలాపురంలోను గురువారం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఈ సభలు నిర్వహించారు. అంబాజీపేట సభకు మధ్యాహ్నం మూడు గంటలకే జనం చేరుకున్నారు. మిద్దెలు, మేడలు, డాబాలు, ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ఆ వేదిక చుట్టూ ఉన్న భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. మహిళలు సైతం అక్కడ విద్యుత్తు తీగల సమీపంలోనే నిలుచుని నాయకులను చూసేందుకు ప్రయత్నించడంతో విద్యుత్తును నిలిపివేసిన పరిస్థితి వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా వారాహి వాహనాన్ని ఆనుకుని ప్రజలు కిక్కిరిసిపోయారు. వేదిక ముందుభాగంలోనే కాదు-హెలిప్యాడ్ వేదిక వెనుక వైపు ఏర్పాటుచేయడంతో ర్యాలీగా నేతలను తీసుకువచ్చేందుకు వెళ్లిన యువత వారాహి వాహనం వెనుక వైపు కూడా పెద్దసంఖ్యలో ఉండిపోయారు.
చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ వాటిపై ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకూ జనం నోటితో, చేతులెత్తి సమాధానం చెప్పడంతో చాలాసేపు బాబు అలాగే కొనసాగించారు. ఎప్పుడూ పవన్‌కల్యాణ్ హలో ఏపీ.. బైబై వైసీపీ అని చివర్లో నినదించి సభ ముగిస్తారు. చంద్రబాబు తన ప్రసంగం చివర్లో హలో ఏపీ… అంటే, సభికులంతా బైబై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు.
పవన్‌కల్యాణ్ అభిమానులకు పెట్టింది పేరైన కోనసీమలో వారి ఉత్సాహం మిన్నంటింది. కోనసీమ పచ్చనిసీమ అని, ప్రేమ పంచే సీమ అని.. దీన్ని జగన్ కలహాల సీమగా మార్చే ప్రయత్నం చేస్తే తామంతా కలిసి ప్రేమ సీమగా మార్చామని పవన్ చెప్పారు. కోనసీమలో అన్నివర్గాలూ కలిసి ఉండాలన్నారు. జనసేన గ్లాసు గుర్తు లేని చోట జనసైనికులు, వీరమహిళలు జనసేన అభిమానులు సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఓటు బదిలీ జరిగేలా జనసేన శ్రేణులన్నీ పూర్తిస్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.
source : eenadu.net
Discussion about this post