‘ముఖ్యమంత్రి జగన్ ఓ 420. ఇది నేను చెప్పడం లేదు. తనపై 28 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ 840. పనికిమాలిన సలహాలు ఇస్తుంటారు. ఇప్పటికే జీతాల రూపంలో రూ.150 కోట్లు లాగేశారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాల్లో తెదేపా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఓట్లేసినవారు మా ఓటర్లే కాదని సజ్జల సెలవిచ్చారు. ఆయన ఎందుకలా అన్నారో ఇప్పుడు అర్థమైంది.. జాబితాల్లో దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని. సాక్షాత్తూ సలహాదారు సజ్జలకు మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో రెండు చోట్లా ఓట్లుండడమే ఇందుకు నిదర్శనం’ అని విమర్శించారు.
విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో గురువారం జరిగిన శంఖారావం సభల్లో లోకేశ్ మాట్లాడారు. ‘దొంగ ఓట్లతో వైకాపా గెలిచింది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి కారణం వాళ్లు ఎక్కించిన దొంగ ఓట్లే. నాడు తప్పు చేస్తున్నారని అధికారులకు చెప్పినా వినలేదు. అక్రమాలకు సహకరించిన ఐఏఎస్, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. దర్యాప్తు నివేదిక వస్తే వారు జైలుకెళతారు. రేపోమాపో మరికొందరు అధికారులపై చర్యలుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నన్ను నలుగురు కుర్రాళ్లు కలిశారు. జగన్‌కు, మీకు తేడా ఏంటని ప్రశ్నించారు. ‘నేను ప్రజల్లో తిరుగుతున్నా.. ఆయన పరదాల మాటున తిరుగుతున్నారు. నేను స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చదివితే.. జగన్ పదో తరగతి ప్రశ్నపత్రం లీకు కేసులో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నాకు క్లాస్‌మేట్స్ ఉంటే.. జగన్‌కు జైల్‌మేట్స్ ఉన్నారు’ అని చెప్పాను.
ఇది మన అద్భుతమైన క్యాబినెట్
దేశంలోనే అత్యంత చెత్త పురస్కారం జగన్ మంత్రిమండలికి ఇవ్వచ్చని లోకేశ్ విమర్శించారు. ‘దిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఇసుక, గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి.. నకిలీ మద్యం అమ్మకంతో పాటు న్యాయస్థానంలో దస్త్రాలను కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.. పిల్ల కాలువలైనా తవ్వించలేని జలవనరుల మంత్రి అంబటి రాంబాబు.. సొంతూళ్లో రైతులకు ధాన్యం సంచులు ఇవ్వలేని పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పిల్లలు ఎక్కువ మంది చదవడంతో వారికి ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందా.. గుడ్డు ముందా అని కథలు చెప్పే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఇది మన అద్భుతమైన క్యాబినెట్’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది తెదేపా కార్యకర్తలు తన తోబుట్టువులేనన్నారు.
విజయనగరానికి బొత్స కుటుంబం క్యాన్సర్ గడ్డ
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ కుటుంబాలు ఉత్తరాంధ్రలో చేసిన భూకబ్జాలు బయటపెట్టడానికి మేం సిద్ధం.. కాదని చెప్పడానికి మీరు సిద్ధమా అని లోకేశ్ సవాల్ విసిరారు. బొత్స కుటుంబం విజయనగరం జిల్లాకు క్యాన్సర్‌లా పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి దాన్ని వదిలిద్దామని పిలుపునిచ్చారు. తెదేపా-జనసేన అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఉచితంగా పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. రోడ్లపై గుంతల కారణంగా నిత్యం వందల మంది ప్రమాదాల బారినపడుతున్నారని, మూడు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడే సీఎం జగన్‌కు అవన్నీ ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
source :eenadu.net
Discussion about this post