‘నా వద్ద డబ్బులున్నాయి. ఎవరేం చేయగలరని జగన్ అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. తనకు చుట్టూ బంగారంతో కట్టిన లంక…వజ్ర, వైఢూర్యాలతో ఉన్న పుష్పక విమానం.. ధీరులు, శూరులు, మందీమార్బలం ఉన్నారని.. ఎవరేం చేయగలరని రావణాసురుడు కూడా అనుకున్నారు. నార వస్త్రాలను ధరించి నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో ఆయనను సంహరించారు. అయోధ్యకు శ్రీరాముడిని తీసుకొచ్చిన మోదీ ఇక్కడుంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన ఈ చిటికన వేలంత రావణాసురుణ్ని గద్దె నుంచి దించడం పెద్ద కష్టమా’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విరుచుకుపడ్డారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ‘దేవదత్తం పూరిస్తున్నానని తాడేపల్లిగూడెం సభలో చెప్పా. అప్పుడు పాంచజన్యమనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు. గుజరాత్‌లో ఉన్న ద్వారక నుంచి వచ్చిన మోదీ ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధ ఫలితం ధర్మానిదే. విజయం పొత్తుదే. కూటమిదే పీఠం’ అని స్పష్టం చేశారు. ‘తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా 2014లో ఈ పొత్తు మొదలైంది. 2024లో బెజవాడ కనక దుర్గమ్మ సాక్షిగా ఇది మరో రూపం తీసుకోబోతోంది. రాష్ట్ర రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దీనికి నేను అండగా ఉన్నానని మోదీ మళ్లీ వచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజల భుజం కాయడానికి ఆయన వచ్చారు’ అని పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో గత అయిదేళ్లలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి గంజాయి రాజధానిగా మారింది. న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాజ్యసభలో హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ మిశ్ర ఒక ప్రశ్నకు సమాధానంగా 2019-21లో 30,196 మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలిపారు. ఇందులో 7,918 మంది 18 ఏళ్లలోపువారు, 22,278 మంది 18 ఏళ్లు దాటిన వారు ఉన్నారని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఒకవైపు భారతదేశానికి వివిధ దేశాల నుంచి కంపెనీలు వస్తుంటే..ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు పారిపోతున్నాయి. రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన సంస్థ హైదరాబాద్‌కు తరలిపోయింది. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయాయి. 2019లో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉంటే ఇప్పుడు అది మైనస్ 3కు పడిపోయింది’ అని ధ్వజమెత్తారు.
source : eenadu.net
Discussion about this post