అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే వారిలో చాలామంది ఇంటిబాట పట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. జగన్ ప్రసంగించే సమయానికి వెనుక భాగంలోని గ్యాలరీలు దాదాపు ఖాళీ అయ్యాయి. సభకు వచ్చిన వారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండలో అవస్థలు పడ్డారు. గొంతు తడుపుకోవడానికి తాగునీరు లేకపోవడంతో దాహంతో అల్లాడారు. ముఖ్యమంత్రితోపాటు 300 మంది వైకాపా నేతలు కూర్చోడానికి వీలుగా చలువ పందిరి ఏర్పాటు చేశారు. వారంతా నీడలో ఉంటే తాము మాత్రం ఎండలో మాడిపోవాలా.. అంటూ సభకు వచ్చిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు సభకు తరలించిన వారికి బస్సుల్లోనే బిర్యానీ ప్యాకెట్‌తో పాటు మద్యం సీసా లేదంటే ప్యాకెట్, రూ.500 నోటు చొప్పున ఇచ్చారు. కడప, చిత్తూరు, కదిరి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మద్యం దుకాణాల వద్దే డబ్బులు పంపిణీ చేశారు. కందుకూరు, రాప్తాడు, బొమ్మేపర్తి క్రాస్ ప్రాంతాల్లో కర్ణాటక మద్యంతో పలువురు వైకాపా నాయకులు హల్చల్ చేశారు. చాలామంది రహదారుల పక్కనే గుంపులుగా కూర్చొని మద్యం తాగారు. భవన నిర్మాణ కార్మికుడు ఒకరు మద్యం మత్తులో ఒక బస్సు బదులు మరో బస్సు ఎక్కి దిగబోతూ ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడగా వెనుక చక్రం కాలిపైకి ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
సిద్ధం వేదికకు 20 కి.మీ. దూరంలో బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో మామిళ్లపల్లి వద్ద నుంచి వాహనాలను కళ్యాణదుర్గం మీదుగా మళ్లించారు. ఈ రోడ్డు ఇరుగ్గా ఉండటంతో భారీ వాహనాలు వెళ్లేందుకు కష్టంగా మారింది. మళ్లించిన మార్గంలో అదనంగా 120 కి.మీ. ప్రయాణించాల్సి రావడంతో చాలామంది సభ ముగిసిన తరువాత వెళ్తామని వాహనాలను నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్-బెంగళూరు మార్గంలోనూ సోమలదొడ్డి వద్ద ట్రాఫిక్‌ను బుక్కరాయసముద్రం మీదుగా నార్పల, బత్తలపల్లి, మామిళ్లపల్లి వైపు మళ్లించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 11 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. బత్తలపల్లి వద్ద ఉదయం నుంచే దుకాణాలను పోలీసులు మూయించడంపై వ్యాపారులు మండిపడ్డారు.
source : eenadu.net
Discussion about this post