జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు. వైకాపా నాయకుల దౌర్జన్యానికి పోలీసుల అత్యుత్సాహం తోడై జగన్ బస్సుయాత్రలో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం ఉదయం 10.30కు అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి రావాల్సి ఉంది. అయితే ఆయన 6 గంటల ఆలస్యంగా సాయంత్రం 4.30కు చేరుకున్నారు. దానికి రెండు గంటల ముందే పోలీసులు 44వ నంబరు జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దాంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. జగన్ కర్నూలు జిల్లాలో ఉండగానే గుత్తి మండలం బసినేపల్లి క్రాస్ వద్ద పత్తికొండ, ఆదోని, మంత్రాలయం మీదుగా వెళ్లాల్సిన వాహనాలను రెండు గంటలపాటు నిలిపివేశారు. సాయంత్రం 4.30 గంటలకు గుత్తి పట్టణంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. 5.30 గంటలకు గుత్తి శివారులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద జగన్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోనూ హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సీఎం జగన్ గుత్తి నుంచి జాతీయ రహదారి మీదుగా అనంతపురం చేరుకునే వరకు ట్రాఫిక్‌ను ఒకవైపునకు మళ్లించారు. దీంతో 50 కిలోమీటర్ల దూరానికి 4.30 గంటల సమయం పట్టిందని వాహనదారులు వాపోయారు. బస్సుయాత్ర ఆలస్యం కావడంతో వైకాపా నాయకులు తరలించిన జనం జగన్ రాక ముందే ఇళ్లకు వెళ్లిపోయారు.
బస్సుయాత్ర సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పెద్దఎత్తున జనాల్ని గుత్తికి తరలించారు. మహిళా కూలీలకు రూ.500 చొప్పున ఇచ్చి ఆటోల్లో తీసుకొచ్చారు. పురుషులకు డబ్బుతోపాటు మద్యం సీసాలు పంచారు. గుత్తిలోని మహాత్మాగాంధీ కూడలికి మధ్యాహ్నం 12 గంటలకే జనాల్ని తరలించారు. జగన్ రాక 6 గంటలు ఆలస్యమవడంతో జనాలు ఎండకు మాడిపోయారు. బస్సుయాత్ర వచ్చేసరికి పట్టుమని 3 వేల మంది కూడా మిగల్లేదు. ఉన్న కొద్దిపాటి జనాలకు బస్సు పైనుంచి అభివాదం చేసుకుంటూనే జగన్ ఒక్కమాటైనా మాట్లాడకుండానే ముందుకు వెళ్లిపోయారు.
source : eenadu.net










Discussion about this post