తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, భీమవరం మాజీ శాసన సభ్యుడు పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు.. జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. 2009లో భీమవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో అదే భీమవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో భీమవరంలో ఓడిపోయారు.ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయించారాయన. జనసేన తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు పులపర్తి అంజిబాబు. వచ్చేది టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తనను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన భీమవరం టికెట్ తనకు ఇచ్చినట్లు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం తన సొంత నియోజకవర్గమని చెప్పారు. వదలబోనని, గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ- భీమవరంలో జనసేన అభ్యర్థే పోటీ చేస్తాడని తేల్చి చెప్పారు. భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తామనే ధీమాను పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోవడంపై స్పందించారు పవన్ కల్యాణ్. అలాంటి ఓటమి తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఓడిపోతానని తెలిసి ఉంటే నేరుగా వైఎస్ జగన్‌పై పోటీకి దిగి ఉండేవాడినని అన్నారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌పై కంటే పులివెందులలో జగన్‌పై పోటీ చేసి ఓడిపోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. భీమవరంలో ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి.. అసాధ్యం అనుకున్న తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ పొత్తును కుదిర్చారని పవన్ కల్యాణ్ తన గురించి తాను చెప్పుకొన్నారు. ఈ అలయెన్స్- రాష్ట్ర, దేశ రాజకీయాలను మార్చివేస్తుందని, ఓ కొత్త శకానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మరోసారి గెలిస్తే రాష్ట్రానికి మాత్రమే కాదు.. దేశానికి హాని జరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ పార్టీని ఓడించక తప్పదని, ఆ ఉద్దేశంతోనే టీడీపీతో చేతులు కలపాల్సి వచ్చిందని వివరించారు. పొత్తులో భాగంగా తాను తీసుకున్న సీట్లు ఎక్కువా తక్కువా అనే విషయాన్ని మర్చిపోవాలని జనసైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మే 15వ తేదీ నాటికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభంజనానికి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోతుందని పేర్కొన్నారు. ఓటమి గెలుపు అనేది తనకు తెలియదని, ముందడుగు వేయడం మాత్రమే తెలుసునని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన స్ట్రాటజీని తాను చూసుకుంటానని చెప్పారు.
Discussion about this post