ఎన్నికలు సమీపించే కొద్దీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మరింత బరి తెగించారని.. తన బినామీ కంపెనీలకు, సన్నిహిత సంస్థలకు సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములను దోచిపెడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ తన బినామీ కంపెనీ ఇండోసోల్ కోసం నిబంధనలన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇండోసోల్‌కు సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం గతంలో భూములు కేటాయించినప్పుడు ‘స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)’ అన్న నిబంధన లేదని, దాన్నిప్పుడు కొత్తగా చేర్చడం భూదోపిడీ కోసమేనని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇప్పటివరకు లీజు ప్రాతిపదికనే భూములు కేటాయిస్తుండగా, ఇండోసోల్ ఆ భూములను కొనేసుకునేందుకు వెసులుబాటు కల్పించడమూ భారీ కుంభకోణంలో భాగమేనని ఆరోపించారు. బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కాకినాడ లోక్‌సభ వైకాపా అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ను ప్రకటించిన రోజే.. ఆయన సోదరుడి కంపెనీ గ్రీన్‌కోకు నజరానాగా సౌరవిద్యుత్ ప్రాజెక్టు పేరుతో 2,300 ఎకరాలను జగన్ కట్టబెట్టారు. తన బినామీ కంపెనీ ఇండోసోల్‌కూ అదనంగా 10,500 ఎకరాలు దోచిపెడుతున్నారు. సన్నిహితుల కంపెనీ జేఎస్‌డబ్ల్యూకు అదనంగా 10,050 ఎకరాలు కేటాయించారు’ అని ఆరోపించారు. అనామక కంపెనీ ఆగ్వా గ్రీన్ ఎనర్జీకి వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుకు మూడు వేల ఎకరాలు కేటాయించాల్సి ఉండగా, ఆరు వేల ఎకరాలు కేటాయించడమూ దోపిడీలో భాగమేనని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇండోసోల్, జేఎస్‌డబ్ల్యూ, ఆగ్వా గ్రీన్‌లు సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదనంగా 23,550 ఎకరాలను దోచిపెడుతున్నారని.. ఎకరం రూ.10 లక్షలు వేసుకున్నా అది రూ.2,350 కోట్ల కుంభకోణమని ఆరోపించారు. గతంలో ప్రభుత్వాలు సౌరవిద్యుత్ సంస్థలకు ఒక్కో మెగావాట్‌కు మూడెకరాలు కేటాయిస్తే.. జగన్‌రెడ్డి దాన్ని ఏకంగా ఆరెకరాలకు పెంచేస్తూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని పట్టాభి ధ్వజమెత్తారు. ‘ఒక మెగావాట్ సౌరవిద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు మూడెకరాలు కావాలి. గతంలో తెదేపా ప్రభుత్వం, 2022 వరకు వైకాపా ప్రభుత్వం అదే పద్ధతిలో భూమి కేటాయించాయి. సోమవారం జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో సౌర విద్యుత్‌కు మెగావాట్‌కు మూడెకరాలకు బదులు ఆరెకరాలకు పెంచారు. ఇది కొత్త రికార్డు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అడ్డగోలుగా మెగావాట్‌కు ఆరెకరాలు కేటాయించడం లేదు. సౌరవిద్యుత్ సంస్థలకు అడ్డగోలుగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మంత్రివర్గ సమావేశం ఆమోదించింది’ అని ధ్వజమెత్తారు. భూకేటాయింపుల్లో కమీషన్ల రూపంలో ఎంత ఆర్జించారో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలని పట్టాభి నిలదీశారు. ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ముఖ్యాంశాలు..
source : eenadu.net
Discussion about this post