నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌కుమార్ అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. ‘టీఏలు, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌లు ఇవ్వనందుకు నిరసనగా జగన్ ప్రభుత్వంపై నాకు మండి… తెదేపాకు అనుకూలంగా సింహ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగులు చెబుతున్నా.. విని కుతకుతలాడండి’ అని వ్యాఖ్యానించారు. అనంతరం సింహ సినిమాలో చెప్పిన ‘నో పోలీస్’ డైలాగుల మధ్య జగన్, రాజారెడ్డి పేర్లను చేర్చారు. ‘జగన్ గారూ మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసీచూడనట్లు పొమ్మన్నారు… అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్తాను సర్. ఉంటే జాగ్రత్తగా ఉండండి… లేదంటే వెంటనే పీఆర్‌సీ ప్రకటించి పారిపోండి’ అని వ్యాఖ్యానించారు. మోహన్ కుమార్ వ్యాఖ్యలపై ఆయన తండ్రి రాజశేఖర్ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. తన కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని, గతంలో పిస్టల్ పేల్చి ఆరు నెలలపాటు సస్పెన్షన్‌లో ఉన్నాడని… తర్వాత కూడా మరో రెండుసార్లు సస్పెండ్ అయ్యారని, కేసు నమోదైందని పేర్కొన్నారు. వైజాగ్‌లో మానసిక వైద్యం కూడా చేయించామని ఆయన వివరించారు. ఆత్మకూరు పోలీసులు సైతం మోహన్‌కుమార్ మానసిక ఆరోగ్యం బాగోదని, ఆ ఉద్దేశంతోనే రాత్రి గస్తీ విధులే ఆయనకు అప్పగిస్తారని వివరించారు.
source : eenadu.net
Discussion about this post