రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, రానున్న తెదేపా ప్రభుత్వంలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస, కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో గురువారం రాత్రి ఆయన ప్రచారం చేపట్టారు. అచ్చెన్న మాట్లాడుతూ గత మూడేళ్లలో స్థానిక సంస్థలను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. వీటన్నింటినీ గాడిలో పెడతామన్నారు. నష్టాన్ని వడ్డీతో సహా పూడ్చుకుందామన్నారు. మద్యం పూర్తిగా నిషేధిస్తామన్న పెద్దమనిషి నకిలీమందు తయారీ, విక్రయాలు జరుగుతున్నా స్పందించలేదని, అవి ఎవరివో అందరికీ తెలుసని ఆరోపించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు హయాంలో నిర్మించిన ఎత్తిపోత పథకాలను ఆధునికీకరించటం ద్వారా రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై చీపుర్లపాడు వద్ద మోడల్ మార్కెట్ యార్డును నిర్మిస్తామన్నారు. కాపుగోదాయవలసలో మాట్లాడుతూ ఓడిపోయే వైకాపాకు ఓటువేస్తే వృథా అని వ్యాఖ్యానించారు. నాయకులు బోయిన రమేష్, కింజరాపు ప్రసాద్, దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post