జగన్ ప్రభుత్వంలో జనాలే కాదు.. చివరకు నేనూ, పవన్ కల్యాణ్ కూడా బాధితులమేనని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన జగన్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టిస్తామని.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. మీ స్పందన చూస్తే ఎన్నికలకు ముందే తెదేపా- జనసేన గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోందన్నారు. జగన్ రెడ్డీ.. పర్చూరు పౌరుషం చూడు. టీవీ చూడాలన్నా భయమైతే మావాళ్లు వీడియో లింకు పంపిస్తారు చూడు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి సునామీ సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాపట్ల జిల్లా ఇంకొల్లులో ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
‘రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వైసీపీ పాలనలో జగన్ ధనవంతుడైతే ప్రజలు పేదవారయ్యారు.
తెదేపా పాలనలో తలసరి ఆదాయం పరుగులు పెడితే నేడు పతనమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనేక అడ్డంకులు, సవాళ్లు అధిగమించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లాం. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ ప్రజలు నేడు ఒక్కొక్కరు రూ.88 వేల మేర ఆదాయాన్ని కోల్పోయారు. తెదేపా హయాంలో 14 శాతం ఉండే వృద్ధి రేటు వైకాపా వచ్చాక 10.93 శాతానికి పడిపోయింది. ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. విభజన జరిగినప్పుడు ఏపీ కంటే తెలంగాణకు 35 శాతం తలసరి ఆదాయం అధికంగా ఉంటే 2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించాం. ఇప్పుడు జగన్ నిర్వాకంతో తలసరి ఆదాయంలో రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే 44 శాతం తక్కువగా ఉంది. మళ్లీ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలి’ అని అన్నారు.
పులివెందుల నుంచే నీ పతనం ప్రారంభం
‘జగన్ నీ పని అయిపోయింది. నీ పాలనకు ఇక మిగిలింది 52 రోజులే. ప్రజలు ఎంతో కసితో తిరుగుబాటు చేస్తున్నారు. పర్చూరు సభకు స్వచ్ఛందంగా వచ్చిన జనాన్ని చూస్తే నీకు రాత్రికి నిద్రపట్టదు. నీ డబ్బు సంచులు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు నీ ఓటమిని ఆపలేవు. పులివెందుల నుంచే నీ పతనం మొదలవుతుంది. నా రాజకీయ అనుభవం ముందు నువ్వో బచ్చా. నీలాంటి వ్యక్తికి భయపడను. తండ్రిని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు దోచుకున్నా నీలో మార్పు రాలేదు’ అని దుయ్యబట్టారు. జగన్‌కు ఉదయం అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రికి జే బ్రాండు మద్యం డబ్బులు కావాలని విమర్శించారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరేనని పోలీసులకు హితవు పలికారు.
మీరు చొక్కాలు మడతపెడితే.. మావాళ్లు కుర్చీలు మడతపెడతారు
వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో చొక్కా మడత పెడదామంటూ సీఎం రెచ్చగొట్టేలా వ్యవహరించారు.. ‘మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు. అప్పుడు మీ కుర్చీ ఊడిపోతుంది. మా వాళ్లందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకుని మీ చొక్కాలకు ఇస్త్రీ చేస్తారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తామని, అధికారం ఉందని ఊరి మీద ఆంబోతుల్లా పడితే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను అభినందిస్తామని కానీ వైకాపాకు సేవ చేసే వాలంటీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘పర్చూరులో అధికారులు వైకాపా అల్లరిమూకలతో కలిసి వెళ్లి మైనింగ్ వ్యాపారులను బెదిరించారు. వారిపై కేసులు పెట్టి వేధించారు. వైకాపా నేతల బెదిరింపు పర్వంతో బయటికి వెళ్లిపోయినవారందర్నీ రప్పించి, గ్రానైట్ పరిశ్రమకు గత వైభవం తీసుకొస్తాం’ అని చెప్పారు.
source : eenadu.net
Discussion about this post