పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే కారణమని.. తెదేపా కోరినట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేసే సీఎస్ జవహర్‌రెడ్డి.. పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించి, వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పింఛన్లకు అవసరమైన నిధులు ఇవ్వకుండా చేయడంతోపాటు, వారికి సరైన సౌకర్యాలు కూడా కల్పించని అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకమీదట గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందించేలా అధికారులకు సూచనలు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా పింఛనుదారుల్ని తప్పుదోవ పట్టించి 33 మంది మరణానికు కారణమైన వైకాపాపై చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష తెదేపాను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఇబ్బందుల్ని సీఎస్‌కు వివరించాం
‘లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రయోజనాలు అందించేందుకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అంటే అమల్లో ఉన్న పథకాలను స్థానాలు మార్చకుండా కొనసాగించాలనేది ఈసీ ఉద్దేశం. అయినా ఇంటింటికీ వెళ్లి పింఛను ఇచ్చే విధానం మార్చి.. పింఛనుదారులందరినీ సచివాలయాల వద్దకు పిలిపించాలని సెర్ప్ సీఈఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీని వల్ల వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుందని.. నిర్ణయాన్ని పునస్సమీక్షించి ఇంటి వద్దనే పింఛన్లు అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కోరాం’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి పొందాలన్న.. జగన్ ఆలోచన మేరకే
‘రాష్ట్రంలోని 1,34,694 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయొచ్చు. అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను.. తెలుగుదేశం పార్టీకి ఆపాదించి, రాజకీయ లబ్ధి పొందాలనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర. ఆయన ఆలోచనకు అనుగుణంగానే సీఎస్ పింఛనుదారులను సచివాలయం వద్దకు పిలిపించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించా. ఇంటివద్దనే పంపిణీ చేయించేలా సవరించిన సూచనలు జారీ చేయాలని సీఎస్‌ని కోరాను. సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసే సీఎస్ నా ప్రతిపాదనను అంగీకరించలేదు’ అని చంద్రబాబు వివరించారు.
నిధులు ఉంచకుండా.. మండే ఎండలో తిప్పించారు
‘పింఛను పంపిణీకి అవసరమైన నిధుల్ని కూడా 3వ తేదీన కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచలేదు. మండే ఎండల్లో 60 లక్షల మంది పింఛనుదారుల్ని ఒకటికి రెండుసార్లు తిప్పించారు. సచివాలయాల్లో డబ్బు లేకపోవడంతో చాలా మంది సొమ్ము తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. ఎండలో రాకపోకల కారణంగా వడదెబ్బ తగిలి 33 మంది పింఛనుదారులు చనిపోయారు. సచివాలయాల్లో డబ్బు లేదనే సంగతి తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు అక్కడికి వెళ్లేలా వైకాపా ప్రచారం చేసింది. వృద్ధుల్ని కావాలనే మంచాలపై తరలించింది. ఇంటింటికీ వెళ్లి పింఛను అందజేస్తే ఈ మరణాలను నివారించగలిగేవారు. 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నా.. పింఛనుదార్లు సచివాలయాలకు రావాలని ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేయడమే దీనికి కారణం. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అధికార పార్టీ మద్యం విక్రయించింది. ఇప్పుడు నడవలేనివారు, మంచానపడిన వారికి ఇంటి వద్దనే పింఛను ఇవ్వకుండా.. ఉద్దేశపూర్వకంగా సచివాలయాలకు రప్పించి.. తెదేపాపై నిందలు మోపారు’ అని లేఖలో పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post