ఖాతాలో డబ్బు లేకుండా చెక్కు ఇవ్వడం.. మోసం చేయడమే. అచ్చంగా ఇలాంటి పనే ముఖ్యమంత్రి జగన్ చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) లేకుండానే ‘చేయూత’ పథకం చివరి విడత నిధుల విడుదలకు ఆయన ఉత్తుత్తి బటన్ నొక్కారు. ఈ పథకానికిగాను రూ.5,060 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క రూపాయి డబ్బు ఇచ్చేందుకు కూడా ఆర్థికశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇది తెలిసీ బహిరంగ సభ పేరిట లబ్ధిదారులను పిలిపించి మరీ వేదికపై నుంచి బటన్ నొక్కారు. ఇదిగో మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైపోతాయనేలా కలరింగ్ ఇచ్చారు. గత గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన సభలో జగన్ చేసిన ఈ ‘షో’ను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వైకాపా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ చేయూత లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నారు. జగన్ బటన్ నొక్కి ఆరు రోజులయినా ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ పథకం లబ్ధిదారులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలే. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అంటూ వారికే టోకరా ఇచ్చారంటే జగన్ ఎంత గుండెలు తీసిన బంటో ఇట్టే అర్థమైపోతుంది.
చేయూత పథకం కింద లబ్ధిదారులకు సెప్టెంబర్లో నిధులు విడుదల చేయనున్నట్లు తొలుత సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని ఫిబ్రవరిలోనే ఇచ్చేయాలని నిర్ణయించారు. తొలుత ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్టు క్షేత్రస్థాయికి సమాచారం పంపారు. ఆ తర్వాత 16కు, 21కి, 26కి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి ఈ నెల 7న విడుదల చేశారు. అప్పటికి కూడా నిధుల విడుదల లేకుండానే ఉత్తుత్తి బటన్ నొక్కారు.
‘చేయూత’ కింద 45-60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తామంది. మొదటి రెండు విడతల సందర్భంగా నిర్దేశిత వయసుగల వారికి సామాజిక భద్రత పింఛను అందుతున్నా చేయూత లబ్ధిని అందిస్తున్నామని జగన్ గొప్పలు చెప్పారు. రెండేళ్లుగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసిన ప్రతిసారీ కొత్త దరఖాస్తుదారుల్లో పింఛను పొందుతున్న వారిని పక్కన పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది మూడో విడత సందర్భంగా చేసిన ఇలాంటి ప్రయత్నానికి దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా నాలుగో విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న 45-60 ఏళ్లలోపు ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు అర్హులు కాదని పేర్కొన్నారు. ఇలాంటివారు ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది వరకు ఉంటారని సమాచారం.
source : eenadu.net
Discussion about this post