వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్‌గా చేస్తే.. రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చారని మండిపడ్డారు.
‘‘రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిశాయి. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మాకు మద్దతివ్వండి. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో 49 చోట్ల వైకాపాను గెలిపిస్తే ఏం ఒరగబెట్టారు? ఈసారి 52 చోట్లా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. తన చర్యలతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు. అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరలను అమాంతం పెంచేశారు. నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఆఖరికి ఇసుక పైనా దోపిడీ చేశారు. భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైంది. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తా అన్నారు.. తెచ్చారా? మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగను అన్నారు.. చేశారా? సీపీఎస్ రద్దు చేశారా? ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఇచ్చారా? పోలవరం పూర్తి చేశారా?’’ అని చంద్రబాబు నిలదీశారు.
source : eenadu.net
Discussion about this post