- వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలపై దాడులు
- 12 లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. ఖర్చుపెట్టింది 2.5 లక్షల కోట్లు
- మిగిలిన సొమ్మంతా ఏమైంది..? ప్రచారానికి 1600 కోట్లా..?
- ఎమ్మిగనూరు స్వర్ణాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ
‘‘వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే.. నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్.. ఇక నీ ఆటలు సాగవు’’ అని సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. బాలయ్య రోడ్‌షోలకు జనం పోటెత్తారు. ఎమ్మిగనూరు, కోసిగిలో జరిగిన రోడ్‌షోలో బాలకృష్ణ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్ సాగిస్తున్న అకృత్యాలపై విమర్శలు గుప్పించారు. అదేక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు.
రాయలసీమలో సాగునీరు ఇచ్చింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.6వేల కోట్ల అప్పుతో ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. జగన్ ఒక్క చాన్స్ అని వేడుకుంటే ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, కానీ, ఆయన అందర్నీ నిలువునా ముంచారని అన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపించినందున.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. అభివృద్ధి కావాలో..? అరాచకం కావాలో..? కూల్చేవాళ్లు కావాలో.. నిర్మించే వాళ్లు కావాలో..? స్వర్ణయుగం కావాలో.. చీకటి రాజ్యం కావాలో..? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రూ.12 లక్షల కోట్లు అప్పుచేసిన జగన్.. నవరత్నాలకు చేసిన ఖర్చు రూ.2.50 లక్షల కోట్లేనని, మిగిలిన సొమ్మంతా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రచార హోల్డింగ్‌ల కోసం రూ.1600 కోట్లు ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేశామని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేసిన జగన్‌కు బుద్ది చెప్పాల్సిన సమయం ఇదేనన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
source : andhrajyothi.com
Discussion about this post