‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్‌లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. మద్యం, ఇసుక, గ్రావెల్, భూముల కుంభకోణాలతో రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని మండిపడ్డారు. ‘ఎన్నో పాపాలు చేసిన జగన్ ఇటీవల నిజాలు మాట్లాడుతున్నారు. తనకు టీవీ, పత్రిక, ప్యాలెస్‌లు లేవని చెబుతున్నారు. నిజమే. అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి. తిరిగి ప్రజలకే చెందుతాయ’ని స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ జిల్లాలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో లోకేశ్ ప్రసంగించారు. అంతకుముందు ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
‘వైకాపా పాలనలో గంజాయి కారణంగా లక్షల కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు రాష్ట్రమంతటా గంజాయి సరఫరా చేస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై ఉక్కుపాదం మోపుతాం’ అని హెచ్చరించారు. ‘ఇసుక ద్వారా జగన్ అయిదేళ్లలో రూ.5,400 కోట్లు అక్రమంగా సంపాదించారు. తెదేపా హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే, ఇప్పుడు వైకాపా నాయకులు పందికొక్కుల్లా తినేస్తున్నారు. యాత్ర-2 సినిమా చూసిన వైకాపా ఎమ్మెల్యేలు తమకిదే అంతిమయాత్ర అని పారిపోతున్నారు. జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరగబోతోంది. అర్జునుడిని, అభిమన్యుడని చెప్పుకుంటున్న జగన్.. ఓ సైకో. భస్మాసురుడు. అతన్ని ఓడించి పేదలు ఆత్మగౌరవం చాటుకోవాల’ని లోకేశ్ పిలుపునిచ్చారు.
నేరాలకు అడ్డాగా విశాఖ
‘ప్రచారానికి వస్తున్న వైకాపా నాయకులను జనం ప్రశ్నించాలి. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిందెవరు? ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే మనల్ని ఎలా రక్షిస్తారో అడగాలి. విశాఖకు రైల్వే జోన్, మెట్రో ప్రాజెక్టు, పరిపాలన రాజధాని, పరిశ్రమలను తీసుకొస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. అవేవీ చేయకపోగా నేరాల అడ్డాగా మార్చింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణాలకు పాల్పడింది. వైకాపా నేతలు దసపల్లా, హయగ్రీవ, సీబీసీఎన్‌సీ చర్చి భూములు కొట్టేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిపై విచారణ జరిపిస్తామ’ని స్పష్టంచేశారు. కృష్ణపట్నం పోర్టులో పది వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని లోకేశ్ మండిపడ్డారు.
కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్
‘వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీల్లో జగన్ కోతపెట్టారు. డిగ్రీ విద్యార్థులకు రూ.8 వేలు, ఇంజినీరింగ్ చేస్తే రూ.32 వేల ఫీజు రీయింబర్స్‌మెంటు ఇచ్చి మిగతా సొమ్ము ఎగ్గొడుతున్నారు. గతంలో తెదేపా అమలు చేసిన విదేశీ విద్యను మళ్లీ తీసుకొస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు కళాశాలలకే ఇస్తాం’ అని లోకేశ్ వెల్లడించారు. ‘ప్రజల కష్టాలు చూసి చంద్రబాబు-పవన్ సూపర్-6 హామీలు ప్రకటించారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు ఏటా డీఎస్సీ వేస్తాం. ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్లున్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున అయిదేళ్లలో రూ.90 వేలు వస్తాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామ’ని లోకేశ్ ప్రకటించారు. అంతకుముందు కార్యకర్తలకు ప్రోత్సాహక అవార్డులు, సూపర్-6 కిట్లు పంపిణీ చేశారు.
source : eenadu.net
Discussion about this post