గతంలో జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పి నమ్మించాడని.. ఆ స్థాయిలో తాము వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడంలో విఫలమయ్యామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఒక రకంగా ఇది తమ బలహీనతేమోనని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ ఎజెండాగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి శ్రీచక్ర అపార్టుమెంట్ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైందని గుర్తుచేశారు. ‘రాజధాని అమరావతిపై కులముద్ర వేసి నాశనం చేశాడు. కోవిడ్ సమయంలో కోవాగ్జిన్ టీకా తయారు చేసి ప్రపంచానికి అందించి తెలుగోడి సత్తా చాటిన భారత్ బయోటెక్‌పై కూడా కులముద్ర వేసి ఒడిసాకు తరిమేశారు. జగన్ వినాశకర చర్యల కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్నవి సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రాన్ని గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చి యువత భవిష్యత్‌ను నాశనం చేశాడు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడిన జగన్ ఎక్కడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. విశాఖలో రుషికొండకు బోడిగుండు చేసి రూ.500 కోట్లతో తనకో ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు. అమరావతిని రాజధానిగా కొనసాగించి ఉంటే ఇప్పటికి 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆయన విధ్వంసకర విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విజనరీ నాయకుడికి, విధ్వంస పాలకుడికి ఉన్న తేడాను యావత్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి’ అని కోరారు. అధికారంలోకి వస్తే నైపుణ్య విద్యను అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
source : andhrajyothi.com
Discussion about this post