ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు కడప ఎంపీ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం కడపకు బయలుదేరారు. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం సొంతగడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైయస్‌ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్ర జిల్లాలో 8 రోజుల పాటు సాగనుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కానున్నారు. ప్రత్యేకించి పులివెందుల్లో విస్తృత ప్రచారానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచే ఆయనకు వ్యతిరేకంగా సోదరి షర్మిల ఎన్నికల ప్రచారం చేయటం వైకాపాను ఇరకాటంలో పెట్టనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్నాన్నను చంపినవారికి జగన్ టికెట్ ఇవ్వటం జీర్ణించుకోలేకనే కడప నుంచి పోటీకి దిగినట్లు ఇటీవల షర్మిల స్పష్టం చేశారు. జగన్ పాలనలో వైఫల్యాలు, జిల్లాకు ఇచ్చిన హామీలు అమలుకాని వైనంపై ప్రజల మధ్య నుంచి ప్రశ్నించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో షర్మిల బస్సు యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
source : eenadu.net
Discussion about this post