అధికార వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు నిరసన సెగలు మంటెక్కిస్తున్నాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి జనం గోడు పట్టించుకోకుండా.. కనీస మౌలిక సదుపాయాల కల్పన పైనా దృష్టి సారించని ఈ నేతలు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఓట్ల యాచనకు బయల్దేరడంతో వారికి అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌కే ప్రజల నిరసన సెగ తప్పడంలేదు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఆయన చేపట్టిన ప్రచార యాత్ర తొలి 5 రోజుల్లోనూ మూడుచోట్ల జనం నిరసన తెలిపారు. తాగునీరు, రహదారులు, మురుగు కాలువల ఏర్పాటు, ఇళ్ల పట్టాలు, ఉద్యోగాల కల్పన వంటి సమస్యలపై జనం నుంచి అధికార పార్టీ నేతలకు వ్యతిరేకత ఎదురవుతోంది. బస్సు యాత్ర ప్రారంభించిన మూడోరోజునే జగన్‌కు జనాల నిరసన మొదలైంది. కర్నూలు జిల్లాలో రోడ్ షోలో కొత్తూరు వద్ద మహిళలు తాగునీరు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.
కోడుమూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సీపీఐ, సీపీఎం నాయకులు సీఎం బస్సుకు ఎదురుగా నిరసన తెలిపారు. నాలుగోరోజు గుత్తి బస్టాండ్ సమీపంలో జగన్ బస్సు టాప్‌పై నిలబడి యాత్రలో సాగుతుండగా.. ఆ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన చుట్టూ రక్షణగా నిలబడాల్సి వచ్చింది. అయిదో రోజున శ్రీసత్యసాయి జిల్లాలో బత్తలపల్లి వద్ద గోపాలమిత్రలు బస్సు యాత్రను అడ్డుకున్నారు. ప్లకార్డులు, బ్యానర్ పట్టుకుని బస్సుకు అడ్డుగా వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ‘అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో మీరే హామీ ఇచ్చారు. ఇంతవరకు న్యాయం చేయలేదు’ అంటూ వారు నిలదీశారు.
source : eenadu.net
Discussion about this post