‘ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరిస్తామన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 118 సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో అధికారంలోకి రాగానే దేశంలో మొట్టమొదట సీపీఎస్ రద్దు చేసి అందరికీ ఆదర్శంగా ఉంటారనుకున్నాం. కానీ రాష్ట్రంలోని నాలుగు లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు వెన్నుపోటు పొడిచారు’ అని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో ‘సాగర సంగ్రామ దీక్ష’ చేపట్టారు. సంఘం విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గూనూరు శ్రీనివాస్, బండారు దేవుడుబాబుల ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘ఓట్ ఫర్ ఓపీఎస్’, ‘సీపీఎస్ రద్దు చేస్తారా.. గద్దె దిగుతారా’ అంటూ నినాదాలు చేశారు. పాత పెన్షన్ హామీని సమాధి చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్(257), పీఆర్టీయూ, ఆపస్, సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘాలు మద్దతు తెలిపాయి.
మంత్రిని కలిసినా ఫలితం లేదు
‘తెదేపా హయాంలో చంద్రబాబునాయుడు ఫ్యామిలీ పింఛను, గ్రాట్యూటీ ఇస్తామన్నారు. వాటితో మేలు కలిగినా ‘సీపీఎస్’ రద్దుకే కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పాం. 2017-18 సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ‘సీపీఎస్ ప్లకార్డు’ పట్టుకున్న ప్రతి ఉద్యోగి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆయన సీఎం అయ్యాక ఓపీఎస్ పునరుద్ధరిస్తారనుకుంటే జీపీఎస్ తీసుకొచ్చారు. ఇది మద్రాస్‌ను చెన్నై చేసినట్లుగా ఉంది. దీంతో ఏ ప్రయోజనం లేదు. ఓపీఎస్ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణను కలిసినా ఎలాంటి ఫలితం దక్కలేదు. సీపీఎస్ కాంట్రిబ్యూషన్‌కు మేచింగ్ గ్రాంట్‌గా వేయాల్సిన మొత్తాన్ని పది నెలలుగా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఓపీఎస్‌తో వ్యవస్థలు నాశనమవుతాయని జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు చెబుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని గడపగడపకూ వెళ్లి వైకాపా ప్రభుత్వం ఎలా మోసం చేసిందో వివరిస్తాం. సీపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు 30 లక్షల ఓట్లున్నాయి. జగన్ ప్రతిదానికీ బటన్ నొక్కినట్లే.. మేము కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా బటన్ నొక్కే సమయం ఆసన్నమైంది’ అని సంఘ నాయకులు హెచ్చరించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి.. ఆ ఉద్యోగులతో నానా చాకిరీ చేయిస్తున్నారని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బత్తిన ప్రసాద్ విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post