‘ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి రూపాయి ఖర్చు చేయలేదు. సరికదా.. కేంద్ర ఆర్థిక సంఘం పల్లెలకు ఇచ్చిన రూ.8,660 కోట్లు, ఉపాధి నిధులు రూ.36 వేల కోట్లు, జలజీవన్ మిషన్, ఆర్‌ఆర్‌ఎం.. వంటి పథకాల కింద కేంద్ర సర్కారు పంపిన రూ.50 వేల కోట్లను ముఖ్యమంత్రి జగన్ దొంగిలించారు. పల్లె ప్రగతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలాంటి వ్యక్తిని గద్దె దింపడానికి సర్పంచులు సిద్ధంగా ఉన్నారు’ అని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పంచాయతీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సంయుక్త సారథ్యంలో బుధవారం అనంత కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతకుముందు నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి వైవీబీ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గ్రామాలకు చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అనంత కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టామన్నారు. రాష్ట్రంలో 12,918 పంచాయతీల పరిధిలో 3.5 కోట్ల గ్రామీణులకు జగన్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఆవేదన చెందారు. రానున్న ఎన్నికల్లో జగన్, ఆయన పార్టీని ఓడించేందుకు పార్టీలకతీతంగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపు మునిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చుక్కా ధనుంజయ, సర్పంచుల సంఘం ఉమ్మడి అనంత జిల్లా అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్, ఛాంబర్ అధ్యక్షుడు వేలూరు రంగయ్య, కార్యదర్శులు ఇస్మాయిల్, ప్రతాప్‌నాయుడు, సర్పంచులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిని కలెక్టర్ కార్యాలయ ఏఓకు అందజేశారు.
source : eenadu.net
Discussion about this post