నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను స్మగ్లర్లు చంపేశారు
రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా?
వాలంటీర్లు నా స్టార్ క్యాంపెయినర్లు
గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా..కదలిరా’ సభలో చంద్రబాబు ధ్వజం
‘జగన్ తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై రాత్రిళ్లు ఆయనకు నిద్ర పట్టడం లేదు. అందుకే అవినీతి డబ్బుతో సిద్ధమంటూ పెద్దపెద్ద కటౌట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెబుతున్నా మిమ్మల్ని(సీఎంను) ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ‘సిద్ధం’ కటౌట్లు చూసిన ప్రతిసారీ ప్రభుత్వం పెట్టిన బాధలు, బాదుడు, హింసా రాజకీయాలు, తరలిపోయిన పరిశ్రమలు, వలసలు గుర్తుకు రావాలి. తెదేపా, జనసేన జెండాలు పట్టుకుని 60 రోజులు సైకిల్ ఎక్కి ప్రచారం చేయండి.. మీ భవిష్యత్తును బంగారం చేస్తా. మీరు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో మంగళవారం నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారని.. వేంకటేశ్వరస్వామిని అధికార పార్టీ నాయకులు రాజకీయాలు, పైరవీలకు వాడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతిని దొంగ ఓట్లకు కేంద్రంగా మార్చారని.. ఎన్నికల సంఘం కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులు చొరబడి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల దస్త్రాలను దొంగిలించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లను తొలగిస్తామని తప్పుడు ప్రచారం
‘తెదేపా వస్తే వాలంటీర్లను తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసే వారికి ఎప్పుడూ మేం వ్యతిరేకం కాదు. మంచి పనిచేసే వాలంటీర్లకు సహకరిస్తాం. జగన్ వల్ల రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రతి ఇంటికీ వెళ్లి మీరు వివరించండి. మీరే (వాలంటీర్లు) నాకు స్టార్ క్యాంపెయినర్లు. ఆస్తుల పంపకం సరిగా జరగలేదని జగన్ చెల్లెలు తిరగబడింది. అంతఃపురం వాస్తవాలు ఆమె చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపిస్తే ఇక్కడ పుట్టిన మీ బిడ్డగా రుణం తీర్చుకుంటా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మేం అధికారంలోకి వస్తేనే.. డీఎస్సీ
‘జగన్.. రాష్ట్రానికి పట్టిన శని గ్రహం. ఆంధ్రప్రదేశ్‌ను రాతియుగం వైపు నడిపిస్తున్నారు. ఇక్కడ యువత, ఆడబిడ్డలను చూస్తుంటే రాబోయేది తెలుగుదేశం- జనసేన ప్రభుత్వమే అనిపిస్తోంది. మేం అధికారంలోకి వస్తేనే డీఎస్సీ వస్తుంది’ అని తెదేపా అధినేత స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్, గంగాధరనెల్లూరు తెదేపా, జనసేన ఇన్‌ఛార్జులు థామస్, పొన్నా యుగంధర్, దొరబాబు, గురజాల జగన్, హేమలత, రాజన్, తేజేశ్వరి, శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post