ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్‌నే రావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మండలంలోని పనబాకం, కల్‌రోడ్డుపల్లి, ఎంకొంగరవారిపల్లి, ఐతేపల్లి – అగరాల పంచాయతీలలో శుక్రవారం జరిగిన ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి ’ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఆయనకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. డప్పువాయిద్యాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. అగరాల పంచాయతీలో దిష్టి తీసి.. గజ మాలలతో సత్కరించారు. అనంతరం సభా ప్రాంగణం వరకు ర్యాలీగా తరలివచ్చారు. అన్ని పంచాయతీలలో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల బోర్డులను మోహిత్‌రెడ్డి ఆవిష్కరించారు..
గ్రామీణ ప్రాంతాలకు సచివాలయ వ్యవస్థను చేరువ చేసి పరిపాలనను సీఎం జగనన్న మరింత సులభతరం చేశారని మోహిత్‌రెడ్డి కొనియాడారు. ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరిందని భావిస్తేనే.. ఓటు వేయండని ధైర్యంగా అభ్యర్థించే హక్కు ఒక్క వైఎస్‌ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. అర్జతే ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నాడు–నేడు కింద పాఠశాలల అభివృద్ధితో పాటు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, విద్యాకానుక అందజేసినట్టు తెలిపారు. దేశంలోనే వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్ అందజేస్తున్న ఏకై క రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలుస్తోందన్నారు. సీఎం జగనన్న ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేశారని గుర్తుచేశారు.
పంచాయతీలలో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతోనే సాధ్యమైందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కొనియాడారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించారని, తన సంపాదనలో 70 శాతం నియోజకవర్గ ప్రజలకు ఖర్చు చేశారని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రజలకు పండుగల సమయాల్లో కానుకలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో దేశంలోనే ఏ ఎమ్మెల్యే చేయలేనంతగా సాహసం చేసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
source : sakshi.com
Discussion about this post