రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో సీఎం జగనన్న ఇచ్చిన సందేశాన్ని సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళదామని పార్టీ శ్రేణులకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ స్థాయి ‘సిద్ధం‘ సభను రాప్తాడులో నిర్వహించేందుకు అనుమతిచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధం సభకు వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ తానై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ తరహా ఎన్నికల సభను దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ ఎన్నడూ నిర్వహించలేదన్నారు. సిద్ధం సభ నిర్వహణకు స్థలాన్ని కేటాయించిన దాతలకు, జన సునామీలా తరలివచ్చిన జగనన్న సైనికులకు, సభా ప్రాంగణాన్ని జనసంద్రంగా మార్చిన రాయలసీమ బిడ్డలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పెత్తందారులతో పోరాడే క్రమంలో జగన్ వెంటే తాము ఉండేందుకు సిద్ధమని ఈ సభ ద్వారా కార్యకర్తలు నినదించారన్నారు. ఐదేళ్లలో పేదలకు చేసిన ప్రతి మంచి పనిపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జెడ్పీ చైర్మన్లు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్లు, ఇతర ప్రతినిధుల అందరికీ పేరుపేరునా రాప్తాడు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపీలు, 14 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, వారు రాసే విషయాల్లో ఏవైనా అవాస్తవాలు, బాధ కలిగించే అంశాలున్నప్పుడు దానిపై స్పష్టత ఇవ్వాల్సిన స్వేచ్ఛ మనకూ ఉంటుందన్నారు. అంతేకాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. రాప్తాడులో ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ఖండించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post