విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగించి వ్యవసాయ పంప్‌సెట్లకు పూర్తి స్థాయి ఓల్టేజీ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మేడాపురం గ్రామ సమీపంలో రూ.2.80 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన 33–11కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పంటలు సక్రమంగా పండించుకునేందుకు మేడాపురానికి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. మేడాపురానికి రోడ్డుసౌకర్యం కల్పిస్తామన్నారు. రిజర్వాయర్లను నిర్మించి పంటల సాగుకు అనుకూలం కల్పిస్తామన్నారు. జగనన్న చొరవతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని అందించామన్నారు. రూ.49కోట్లతో అన్ని గ్రామాలకు తాగునీటిసౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాలన్నారు. అనంతరం గుర్రప్పస్వామి ఆలయానికి రూ.లక్ష, శివాలయానికి రూ.50వేలు ఎమ్మెల్యే అందజేశారు.
source : sakshi.com
Discussion about this post