‘‘ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే పదేళ్లపాటు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. హోదా కోసం పోరాడేవాళ్లు కావాలా? తాకట్టు పెట్టేవాళ్లు కావాలా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి’’ అంటూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఇతర కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలతో కలిసి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ను ప్రకటించారు. ‘‘ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రత్యేక హోదాపై తీర్మానం చేసింది. వైసీపీ, టీడీపీ అధినేతలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంది. కాబట్టే కోమాలో ఉన్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టా. రాజన్న సంక్షేమ పాలనలో రైతు రాజు అవుతాడు. ‘ఇందిరమ్మ అభయహస్తం’ పేరిట ప్రతి పేద ఇంటికీ ప్రతి నెలా రూ5వేలు మహిళ అకౌంట్‌లోకి వచ్చేలా చేస్తాం. పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగించేందుకు అభయహస్తం ఇవ్వబోతున్నాం.’’అని షర్మిల హామీ ఇచ్చారు.
ఇచ్చోటనే హోదాపై మోదీ వాగ్దానం…
2014 ఎన్నికల ప్రచార సభలో ఇదే వేదికగా పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి ప్రధాని అభ్యర్థి మోదీ వాగ్దానం చేశారని షర్మిల గుర్తు చేశారు. ‘‘ఆనాటి సభలో ఏపీని స్వర్ణాంధ్రగా మారుస్తామని మోదీ అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేందుకు సాయపడతామన్నారు. హార్డ్‌వేర్ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. పెట్రోలియం పరిశ్రమలు తెస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కమాటైనా నిలబెట్టుకోలేదు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ గాలికొదిలేశారు. పోలవరం పక్కన పెట్టేశారు. రాజధాని లేకుండా పోవడం బాధాకరం. విభజన చట్టంలో ఏపీకి రావలసిన హక్కులను ఒక్కటి కూడా సాధించుకోలేక పోయాం. రామభక్తుడినని చెప్పుకొనే ఆయన మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టారు. ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన మోదీ కేడీ కాక ఇంకేమవుతాడు. మోదీ అంటేనే మోసం’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
source : andhrajyothi.com
Discussion about this post