ఇల్లు కట్టుకోవడం కోసం రాష్ట్రంలోని పేదలకు పంపిణీ చేసిన జగనన్న కాలనీల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. పేదల అమాయకత్వం, అవసరాలు, ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న వైకాపా నేతలు, దళారులు, స్థిరాస్తి వ్యాపారులు వాటిని తక్కువ ధరకు దక్కించుకుంటున్నారు. అనంతరం వాటిని అధిక ధరలకు ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాలనీల్లో మంజూరు చేసిన స్థలాలు, ఇళ్లను పదేళ్ల వరకు విక్రయించకూడదు అన్నది నిబంధన. దీంతో అధికార పార్టీ నాయకులు, దళారులు, స్థిరాస్తి వ్యాపారులు పేదల స్థలాలను అనధికారికంగా కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం మాట మీదనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరి కొన్నిచోట్ల రూ.100 విలువైన స్టాంప్ పత్రాలపై రాయించుకుంటున్నారు. గృహ నిర్మాణ సంస్థ దస్త్రాల్లో మాత్రం లబ్ధిదారుడి పేరే ఉంటుంది. అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు సంక్రమించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందంలో పేర్కొంటున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల లే-అవుట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వాటిలోని 70 శాతానికి పైగా స్థలాల్లో విక్రయాలు సాగుతున్నాయి.
ఏ మూలకూ సరిపోని సాయం
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జగనన్న కాలనీల కింద పట్టణాల్లో సెంటు విస్తీర్ణం, గ్రామాల్లో సెంటున్నర విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను కేటాయించింది. పట్టణాల్లోని కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. గ్రామాల్లోని ఒక్కొక్కరికి కేంద్రం రూ.1.50 లక్షలు ఆర్థికసాయంగా, రూ.30 వేలను ఉపాధి హామీ పథకం కింద అందజేస్తోంది. అంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు లెక్క. రాష్ట్రం ఇచ్చేది సున్నా. ప్రభుత్వం అందజేసిన విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవడానికి కనీసం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల ఖర్చు అవుతుంది. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిన దృష్ట్యా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏ మూలకూ సరిపోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
రూ.50 కోట్ల విలువైన స్థలాల కొనుగోళ్లు
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ పోతులనాగేపల్లిలోని జగనన్న కాలనీలో ప్రభుత్వం పేదలకు 6,230 ప్లాట్లను కేటాయించింది. పట్టణానికి సమీపంలో ఉండటం, లే-అవుట్ మధ్యలో నుంచి ప్రధాన రహదారి వెళ్తుండటంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో వైకాపా నాయకులు ఊరుకుంటారా? దళారుల అవతారమెత్తి.. అమాయక పేదలను మభ్యపెట్టి ఇళ్ల స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుంది. పేదలకు మాత్రం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నారు. వాటిని ఇతరులకు రూ.5 నుంచి రూ.6 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇలా వైకాపా నేతలు రూ.50 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పేదల నుంచి కొనుగోలు చేశారు.
source : eenadu.net
Discussion about this post