బస్సు యాత్ర చేస్తున్న జగనన్నా..! 2019 ఎన్నికలకు ముందు మీరు ఊరూరా తిరుగుతూ.. చంద్రబాబు కానుకలిచ్చారనే విషయాన్ని కప్పిపెట్టి, రేషన్ దుకాణాల్లో ఏమీ ఇవ్వడం లేదంటూ అసత్యాలు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే మరిన్ని సరకులు ఇస్తామని నమ్మబలికారు. తీరా సీఎం అయ్యాక.. ఉన్నవాటినీ ఎత్తేసి నమ్మకద్రోహం చేశారన్న సంగతి మరిచిపోయారా?
తెదేపా ప్రభుత్వంలో ఏటా 1.30 కోట్ల మందికి రంజాన్ తోఫాతోపాటు క్రిస్మస్, సంక్రాంతి కానుకల్ని అందించేవారు. మొత్తంగా వీటికి రూ.1,630 కోట్ల వరకు ఖర్చు చేశారు. పండగపూట ఇంటింటా సంతోషం చూడాలనే ఉద్దేశంతో తెచ్చిన ఆ పథకాలను.. అధికారంలోకి రావడంతోనే జగన్ నిర్దయగా ఎత్తేశారు. మొత్తం రేషన్ వ్యవస్థనే నీరుగార్చారు. కనీసం పండగ కానుకలూ ఇవ్వకుండా పేదలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న ‘ఘనత’ వైకాపా సర్కారుదే మరి.
ప్రస్తుత ధరల ప్రకారం ఒక్కో తోఫా విలువ రూ.535 వరకు అవుతుంది. ఒక్క రంజాన్ తోఫాలోనే 11.25 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.60 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.300 కోట్లను జగన్ మిగుల్చుకున్నారు.
రంజాన్ సమయంలో అందరితోపాటే వారికీ బియ్యం, చక్కెర మాత్రమే ఇచ్చారు. కనీసం గోధుమపిండి కూడా అందించలేని దుస్థితికి రేషన్ వ్యవస్థను దిగజార్చారు. తెదేపా హయాంలో కిలో రూ.40 చొప్పున రెండు కిలోల కందిపప్పును రూ.80కే ఇచ్చేవారు. 9 నెలలుగా కందిపప్పు పంపిణీ కూడా సరిగా లేదు. మార్కెట్లో కిలో రూ.160 నుంచి రూ.180 పెట్టి కొనాల్సి వస్తోంది. పండగ సమయంలో ఖీర్ చేసుకోవాలన్నా.. కనీసం పంచదార కూడా పెంచి ఇచ్చే పరిస్థితి లేకపోయింది.
రంజాన్ తోఫా కింద తెదేపా ప్రభుత్వం నాలుగు రకాల నిత్యావసరాలను ప్రతి ముస్లిం కుటుంబానికి అందించింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే.. తోఫా విలువ రూ.500 పైనే ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 11.25 లక్షల కుటుంబాలు దీనివల్ల అప్పట్లో లబ్ధి పొందాయి. అంటే సుమారు రూ.60 కోట్ల పైనే. పథకాన్ని ఎత్తేయడం ద్వారా ఒక్కో కుటుంబంపై ఆ మేరకు వైకాపా ప్రభుత్వం భారం మోపుతోంది. అయినా జగన్ మాత్రం పేదలు, పెత్తందారులంటూ ప్రసంగాలు వల్లెవేస్తుంటారు.
source : eenadu.net
Discussion about this post