ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగుల నోట్లో మట్టి
దాదాపు 60 వేల దరఖాస్తులపై అనర్హత కత్తి
ఇటీవల విడుదల చేసిన కొత్త పింఛన్లలోనూ నిరాశే
‘‘చేయూత కింద లబ్ధి పొందుతున్న 45-60 ఏళ్ల వయసు మహిళల్లో ఆరు లక్షల మందికిపైగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారు. వీరంతా సామాజిక భద్రత పింఛన్లనూ పొందుతున్నారు. ఈ విషయం తెలిసీ… అలాంటి వారికే ఇంకా ఎక్కువ సాయం అందించాలనే ఆలోచనతోనే చేయూత కింద రూ.18,750 ఇస్తున్నాం. వీరికి ఇవ్వకపోయినా పర్వాలేదని చాలామంది చెప్పినా, వారి కాళ్లపై వారు నిలబడేందుకు సాయం అందించాలని నిర్ణయించాం’’ అని 2021 జూన్ 22న చేయూత రెండో విడత ఆర్థిక సాయం విడుదల సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు వింటే అభాగ్యులపై ఆయన ఎంతటి కరుణ చూపిస్తున్నారో అనిపిస్తుంది కదా? కానీ, చేతల్లోకి వచ్చేసరికి అసలు రంగు బయటపెట్టారు. రెండేళ్లుగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసిన ప్రతిసారీ… కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారిలో పింఛను పొందుతున్న వారిని పక్కన పెడుతున్నారు. గతేడాది ‘చేయూత’ మూడో విడత సందర్భంగా చేసిన ఇలాంటి ప్రయత్నానికి దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా నాలుగో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుండగా… మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నారు.
మొత్తం లెక్క వెల్లడికాకుండా కుతంత్రం
చేయూత కింద 45-60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైకాపా ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేలు అందిస్తామంది. ఇప్పటికే మూడు విడతలు ఇచ్చింది. ఈనెలలో నాలుగో విడత విడుదల చేయనుంది. ఈసారి దరఖాస్తుదారుల వివరాలను రాష్ట్రస్థాయిలోనే ప్రభుత్వం తనిఖీ చేసింది. ఇప్పటికే పింఛను పొందుతున్న 45-60 ఏళ్లలోపు వారిలో దాదాపు 60 వేల మందిని అనర్హులుగా తేల్చింది. అయితే, ఇంతమందిని ఒకేసారి అనర్హులుగా మార్చినట్లు బహిర్గతమైతే… ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కుతంత్రానికి తెరతీసింది. ప్రతి సచివాలయం పరిధిలో సగటున నలుగురు చొప్పున అనర్హులు ఉండేలా చూసింది. ఇలా మొత్తం 15,004 సచివాలయాలకు కలిపి లెక్కేస్తే 60 వేల వరకు ఉంటారు. అందుకే ఈ సంఖ్యను ఎక్కడా వెల్లడించలేదు. ఇటీవల సచివాలయాల వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను క్షేత్రస్థాయికి పంపింది.
కొత్త ఏడాది ప్రారంభంతోనే మోసం
జనవరి ఒకటిన ఇచ్చిన కొత్త పింఛన్లలోనూ దాపరికమే ప్రదర్శించారు. గత ఆరు నెలల్లో దాదాపు 2.14 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం 1.17 లక్షల మందినే ఎంపిక చేసింది. మిగతా 97 వేల మందికి ఎందుకివ్వలేదో చెప్పేవారే లేరు. బాధితులంతా సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వారికి సరైన సమాధానం చేప్పే వారే కరవయ్యారు.
source : eenadu.net
Discussion about this post