‘ఓడిపోతున్నాననే బాధతో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన పడుతున్న వేదన వర్ణనాతీతం. తోడబుట్టిన చెల్లి షర్మిలను నోటికొచ్చినట్లు తిడుతున్నవారిని ప్రోత్సహించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవాడు గాండీవధారి ఎలా అవుతాడు? వైఎస్ వివేకా కుమార్తె సునీతను చంపేస్తామని భయపెట్టే వారికి మద్దతు పలుకుతున్నవాడు సవ్యసాచి ఎలా అవుతాడు..? ఎవరు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. ఎవరు దోపిడిదారో, ఎవరు అవినీతిపరుడో ప్రజలకు స్పష్టంగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
‘జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తూ తాను అర్జునుడినంటూ తనకు తానే చెప్పుకొంటున్నారు. ఇది కలియుగం. ఇక్కడ అర్జునులూ.. కృష్ణులూ ఉండరు. నేను పవన్‌కల్యాణ్, ఆయన జగన్ మాత్రమే. సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు, ఆమెను ఇష్టారీతిన తిట్టించేవాడు మన ఇంట్లోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ కల్పిస్తారు? మన ఆడపడుచులను ఎలా కాపాడతారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని ఆయన ప్రజలను కోరారు. హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆయన కుమారుడు అనుదీప్ జనసేన పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన పార్టీ అభిమానులను ఉద్దేశించి పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
జగన్ దుర్మార్గపు పాలన మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించలేం
జగన్ దుర్మార్గపు పాలన మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యం. అయిదేళ్లలోనే రాష్ట్ర పరిస్థితి ఇంత దిగజారిపోతే మరోసారి జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయం కోసం బలమైన పోరాటం అవసరం. శత్రువు ఎన్ని మోసాలైనా చేసి అధికారంలోకి రావాలని పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. పోటీ చేసే ప్రతి చోటా తప్పకుండా గెలవాలనే లక్ష్యంతోనే మన ప్రణాళికలు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల బలమైన ప్రజా ప్రభుత్వం రాబోతోంది. అసెంబ్లీలో జనసేనది బలమైన పాదముద్ర ఉంటుంది.
జగన్ చెప్పినన్ని అబద్ధాలు ఎవరూ చెప్పి ఉండరు. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, మద్య నిషేధం…ఇలా జగన్ అబద్ధాల జాబితాకు అంతు అనేది ఉండదు. వైకాపా వచ్చిన తర్వాతే రాజకీయాలు దిగజారిపోయాయి. ఇది చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. జనసేనలోకి ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేత బాలశౌరి రావడం ఎంతో ఆనందంగా ఉంది. పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఆయనకు ఉన్న అవగాహన ఎంతో ఆకట్టుకుంది. అలాంటి వ్యక్తి జనసేన తరఫున మరోసారి పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తారని ఆశిస్తున్నా’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.
Discussion about this post