పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటున కూడా నమ్మొద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సైనికులేనన్నారు. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబీఎన్, టీవీ–5.. ఇంకా ఇలాంటి వారు తోడు లేరని.. ఎల్లో ఛానెల్స్, పత్రికలను బాబులాగా పోషించలేదని చెప్పారు.
అందువల్ల సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్ అని, ఒక ఛానల్ ఓనర్ అని దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఎదుర్కోవాలని చెప్పారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంటా వివరించాలని కోరారు. పేదవాడి భవిష్యత్‌కు అండగా నిలబడేందుకు, మంచి చేసిన మన ప్రభుత్వానికి తోడుగా ఉండేందుకు, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలిపించేందుకు, రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మళ్లీ మనమంతా సిద్ధమై ఈ చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందామని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ గురువారం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. జనం గుండెల్లో గుడి కట్టుకున్న మనల్ని ఎదుర్కొనేందుకు వారు జెండాలతో జత కట్టారని.. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు తరలి వచ్చిన ప్రజా సైన్యంతో నంద్యాల ఒక సముద్రంలా మారి ‘సిద్ధం’ అంటోందన్నారు.
source : sakshi.com
Discussion about this post