రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఉన్న గ్రాఫ్ కూడా పడిపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఆయన పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టి షర్మిలను ముఖ్యమంత్రి జగన్‌పైకి పంపించారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తి అనేక పదవులు పొందారని, దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైకాపాను టార్గెట్ చేయడానికే షర్మిలను అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఎమ్మెల్యే తిప్పేస్వామి గైర్హాజరు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి సమావేశాలు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గైర్హాజరయ్యారు. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇటీవల ఈర లక్కప్పను నియమించడంతో ఆయన సమావేశాలకు దూరంగా ఉన్నారు.
మహిళా సంఘాల సభ్యులతో సమావేశం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం మడకశిరలోని యాదవ కల్యాణమండపంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి అత్యధికంగా మహిళా సంఘాల సభ్యులనే తరలించారు. అయితే సాయంత్రం 4గంటలు దాటినా మంత్రి రాకపోవడంతో మహిళలు విసిగిపోయి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సంఘాల లీడర్లు ఎంత అడ్డుకున్నా వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో మంత్రి వచ్చే సమయానికి కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో పార్టీ నాయకుల సమావేశమా లేక మహిళా సంఘాల సభ్యుల సమావేశమా అంటూ పట్టణంలో చర్చ జరిగింది.
source : eenadu.net
Discussion about this post