జిల్లాలో గ్లాసు గుర్తు పార్టీ జనసేన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నా…క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలో రెండు స్థానాలు తమకు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలతో ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు పరిధిలో ఒక్క చోటైనా పోటీ చేస్తుందా.. అన్నది సందేహంగా మారింది. మరోవైపు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా ఉండదని టీడీపీ కార్యకర్తలు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ కూడా డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్నారు. దీంతో అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో జనసేన కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు. గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ జెండా మోయాల్సిందేనా అని మదనపడుతున్నారు. జనసేన అధినేతకు చెప్పలేక.. టీడీపీ వెంట నడవలేక.. కొందరు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఈ ఎన్నికల్లో జిల్లాలో కనీసం రెండు సీట్లు డిమాండ్ చేయాలని జనసేన నాయకులు అనుకున్నారు. ధర్మవరం, పుట్టపర్తి లేదా కదిరి సీటు జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో జనసేన పోటీ ఉండదని తేలిపోయింది. అక్కడక్కడా జనసేన పేరుతో తిరిగే కార్యకర్తలు.. టీడీపీ జెండా మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. కనీసం కార్యకర్తల బాధలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలోని ఓ జనసేన కార్యకర్తతో మాట్లాడగా.. ‘గట్టిగా ప్రయత్నిస్తే 65 సీట్లలో పోటీ చేసే వాళ్లం. కానీ మా పవనన్న పట్టించుకోకపోవడంతో ఆ సంఖ్య 20 లోపే ఉంటుందేమో. ఏమీ చేయలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పవన్ కల్యాణ్ సైకిల్ దిగితేనే మేం పోటీలో ఉండేది’ అని మరో కార్యకర్త తన మనసులో మాట తెలియజేశారు.
జిల్లాలో జనసేన నాయకులు ఎవరని సామాన్యులను ప్రశ్నిస్తే… కనీసం రెండు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. కార్యకర్తలే లేకపోవడంతో గ్రామ స్థాయి నాయకులే నియోజకవర్గ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్న ఒకరిద్దరు కూడా పబ్లిసిటీ పిచ్చితో జనసేనలో తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
source : sakshi.com
Discussion about this post