ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించొద్దంటూ ఎన్ని ఫిర్యాదులందినా, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వాటన్నింటినీ బేఖాతరు చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను అదర్ పోలింగ్ ఆఫీసర్స్ (ఓపీవో)లుగా నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమకెలాంటి అభ్యంతరమూ లేదని తేల్చిచెప్పింది. అయితే పోలింగ్ పార్టీల్లో వారిని నియమించేందుకు కొన్ని షరతులు విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.
తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తే ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా సాగదని ప్రధాన ప్రతిపక్షం గత నెల 9న విజయవాడకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా వారికి ఓపీవోలుగా విధులు అప్పగించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.
గరిష్ఠంగా ఒక్కరే ఉండాలి
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ (ఓపీవోలు)గా మాత్రమే విధులు అప్పగించాలి. ఓటరు చేతివేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలే వారికివ్వాలి.
ప్రతి పోలింగ్ పార్టీలోనూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు గరిష్ఠంగా ఒక్కరే ఉండాలి.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు)గా విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ పార్టీల్లో నియమించొద్దు. పోలింగ్ రోజున వారికి నిబంధనల ప్రకారం ఇతరత్రా విధులుంటాయి.
వాలంటీర్లు ఎన్నికల విధుల్లో వద్దే వద్దు
గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వారిని అనుమతించొద్దని మరోమారు స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్ 13న ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను మరోసారి గుర్తు చేసింది.
సాధారణంగా అదర్ పోలింగ్ ఆఫీసర్ (ఓపీవో)గా వ్యవహరించేవారిని సెకండ్ పోలింగ్ ఆఫీసర్, థర్డ్ పోలింగ్ ఆఫీసర్, ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్, ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ అంటారు. సెకండ్ పోలింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు.. ఓటరు ఎడమచేతి చూపుడు వేలికి ఇంకు పూయటం, ఓటర్ల రిజిస్టర్ (17ఏ)లో ఓటరు వరుస సంఖ్య, గుర్తింపు కార్డు పేరు రాయటం, రిజిస్టర్‌లో ఓటరు సంతకం, వేలిముద్ర తీసుకోవటం చేస్తారు. థర్డ్ పోలింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు ఓటర్లు స్లిప్పులకు ఇన్‌ఛార్జిగా ఉంటారు. అయితే ఎన్నికల సంఘం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఓపీవోలుగా నియమించుకోవచ్చని, ఓటరు చేతివేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలే వారికివ్వాలని చెప్పింది. ఇవన్నీ ఎన్నికల విధుల్లో భాగమే.
source: eenadu.net
Discussion about this post