ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నమ్మబలికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచారని, ఎన్నికల సిద్ధమంటూ మళ్లీ మోసం చేయాలనుకున్నా ఎవరూ నమ్మరని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధం పేరుతో ఆదివారం రాప్తాడుకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా.. తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అనంతపురం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జగన్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంకటప్ప, బండి పరశురాం మాట్లాడుతూ.. 2019లో ఎన్నికల్లో సకాలంలో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తామని, నిరుద్యోగుల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, మద్యపానం నిషేధిస్తామంటూ తప్పుడు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. విద్యార్థులతో మొదలుకుని అన్ని వర్గాలకు నరకం చూపించిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డేనని, సిద్ధం పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న జగన్‌ను అనంతపురం జిల్లాలో అడుగుపెట్టనివ్వమని వారు హెచ్చరించారు.
source : eenadu.net
Discussion about this post