సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు.. ఏ2 ప్రోద్బలంతో జగన్ పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నదీ తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల తీరు ఆది నుంచీ అనుమానాస్పదంగా ఉంది. అందుకు తగ్గట్లే రిమాండ్ రిపోర్టు రూపొందించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారుచేశారు. ఇంకా సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలని, మరికొందరు సాక్షులను విచారించాలని, మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాలని కేసు దర్యాప్తుచేస్తున్న నార్త్ ఏసీపీ ప్రసాద్ రిపోర్టులో ప్రస్తావించారు.
ఈ కేసులో వడ్డెరకాలనీకి చెందిన అయిదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్ అరెస్టును గురువారం మధ్యాహ్నం చూపించారు. ఇన్ని రోజులు విచారించినా అసంపూర్తి రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు, ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. అదుపులోకి తీసుకున్న మైనర్లను సాక్షుల కింద చేర్చారు. దుర్గారావును రెండో నిందితుడిగా చేరుస్తారా అన్న అనుమానాలు ముసురుతున్నాయి. ఇతని ద్వారా మరికొందరిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు దుర్గారావు ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. అతడిని రిమాండ్ రిపోర్టులోనూ నిందితుడిగా చూపించలేదు. రెండు రోజులైనా అతని పాత్రపై ఇంకా తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దుర్గారావు ఆచూకీ కోసం అతని భార్య, పిల్లలు, బంధువులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దుర్గారావును వదిలిపెడతారా? లేక అరెస్టు చూపిస్తారా? అనే దానిపై పోలీసులు నోరు విప్పడం లేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది.
సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌టవర్ డంప్ విశ్లేషణ, సీడీఆర్‌ల ద్వారా సతీష్‌ను నిందితుడిగా తేల్చామని పోలీసులు అంటున్నారు. రిమాండ్ రిపోర్టులో పలువురు సాక్షులను విచారించాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సతీష్‌ను విచారించినా.. ఆధారాలను పూర్తిస్థాయిలో సంపాదించలేదు. కేవలం ఏ2 చెప్పిన మీదటే జగన్‌పైకి రాయి విసిరాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ కారణంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
source : eenadu.net
Discussion about this post