అనంతపురం పార్లమెంట్ పరిధిలోని గిరిజన గ్రామాల్లో 30 రోజులపాటు కార్యాచరణ ప్రణాళికతో పర్యటించనున్నామని తెదేపా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌నాయక్ తెలిపారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్టీ సెల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అమలవుతున్న పథకాలన్నీ రద్దు చేసి వారికి అన్యాయం చేశారన్నారు. తెదేపా హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు ఇచ్చేవారని, వైకాపా ప్రభుత్వం గిరిజనులకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల నిర్వహణకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు శంకర్, అనీల్, రామాంజనేయులు, రాజేష్, మనోహర్, హనుమాన్‌నాయక్ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post