చాలా బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపికచేసి, కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యమివ్వవచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరోవైపు ఉద్యోగం రెండూ సొంతమవుతాయి. ఇలా కోర్సులో చేరినవాళ్లు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే, మరో ఏడాది చదువునూ ఆన్‌లైన్ ద్వారా పూర్తిచేసుకుని ఎంబీఏ పట్టా అందుకునే అవకాశం ఉంది. పీజీడీబీఎఫ్ కోర్సులో ఎంపికకు ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటి ప్రతిభతో అవకాశమిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష
మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్‌లో 60, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగంలో 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు. అయితే అర్హత సాధించడానికి సెక్షన్ల వారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందడం తప్పనిసరి.
ఇంటర్వ్యూ, తుది ఎంపిక
పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత మందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితాకు ఆన్‌లైన్ పరీక్షలో వారు సాధించిన మార్కులు కలుపుతారు. పరీక్షలో సాధించిన స్కోరులో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు కలిపి కేటగిరీల వారీ మెరిట్ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు.
కోర్సులో ఇలా..
మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తిచేయాలి. ఏడాది కోర్సులో.. 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 లక్షలు. దీనికి జీఎస్‌టీ అదనం. అవసరమైనవారికి ఐడీబీఐ రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని, విధుల్లో కొనసాగితే అప్పటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు సమాన మొత్తంలో (రూ.60 వేలు చొప్పున) ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరినవారు మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే రూ.2 లక్షలతోపాటు, రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని వడ్డీతో కలిపి వసూలు చేస్తారు.
స్టైపెండ్, వేతనం
కోర్సులో ప్రతి నెలా రూ.5000 చొప్పున మొదటి 6 మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ.15,000 చొప్పున ఇంటర్న్‌షిప్‌లో రెండు నెలలు ఇస్తారు. చివరి నాలుగు నెలలు బ్యాంకులో వృత్తిగత శిక్షణ ఉంటుంది. ఈ సమయంలోనూ ప్రోత్సాహకం అందుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేసి, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం అందుతుంది. అలవెన్సులూ దక్కుతాయి. మూడేళ్ల తర్వాత గ్రేడ్ ఏ అధికారి (అసిస్టెంట్ మేనేజర్)గా అవకాశమిస్తారు.
ఖాళీలు:విభాగాల వారీ.. అన్ రిజర్వ్‌డ్ 203, ఓబీసీ 135, ఎస్సీ 75, ఎస్టీ 37, ఈడబ్ల్యుఎస్ 50 ఉన్నాయి.
విద్యార్హత:జనవరి 31, 2024 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి.
వయసు:జనవరి 31, 2024 నాటికి 20 – 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే జనవరి 31, 1999 – జనవరి 31, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ:మార్చి 17
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు:ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
దరఖాస్తు ఫీజు:ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:ఫిబ్రవరి 26
వెబ్‌సైట్:https://www.idbibank.in
Discussion about this post